ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పథకాల్లో సీఎం ఫోటో, పేరు వాడొచ్చు..: సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 08:10 PM

తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరును, ఫోటోలను వాడకుండా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో పథకాల ప్రచారంలో తమ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పేరు, ఫోటోలను యథావిధిగా ఉపయోగించుకోవడానికి డీఎంకే ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వు కేవలం అనవసరం మాత్రమే కాదని.. ఇది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అ కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన ఏఐఏడీఎంకే నాయకుడు సి.వి.షణ్ముగంకు సుప్రీం కోర్టు పది లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది.


ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో అమలు చేస్తున్న 'ఉంగళుడన్ స్టాలిన్' (మీతో స్టాలిన్) అనే పథకానికి వ్యతిరేకంగా సి.వి.షణ్ముగం మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. పథకాలకు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పేరు పెట్టడం, ఆ పథకాల ప్రచార ప్రకటనలలో వారి ఫోటోలను ఉపయోగించడం ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. సంక్షేమ పథకాలలో ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రుల పేర్లను, ఫోటోలను వాడకూడదని జూలై 31న ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. అంతేకాకుండా పార్టీ గుర్తు లేదా జెండాను కూడా పథకాల ప్రచారంలో ఉపయోగించకుండా నిషేధించింది.


అయితే ఈ తీర్పు సంక్షేమ పథకాల అమలును నిలిపివేయడానికి కాదని.. కేవలం వాటి ప్రచారంలో ఉండే పేరు, కంటెంట్‌కు మాత్రమే పరిమితమని హైకోర్టు స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై డీఎంకే ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈక్రమంలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి.అంజరియాలతో కూడిన ఈ బెంచ్.. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పథకాలకు నాయకుల పేరు, ఫోటోలు పెట్టడంపై ఆంక్షలు విధించడం చట్టబద్ధమైన పరిధిలో లేదని.. ఈ అంశంపై హైకోర్టు జోక్యం చేసుకోవడం సరైనది కాదని స్పష్టం చేసింది.


ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి వేరే మార్గాలు ఉన్నాయని, ప్రజల సొమ్ము దుర్వినియోగం అయితే దానికి చట్టపరమైన పరిష్కారాలు వేరుగా ఉంటాయని పేర్కొంది. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రుల పేర్లు, ఫొటోలు ఉంటున్నాయని గుర్తు చేసింది. ఈక్రమంలోనే మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. పథకాలకు పేరు పెట్టడం, ప్రచారం చేసుకోవడం ప్రభుత్వ నిర్ణయాధికారమని.. దాన్ని కోర్టులు నిలిపివేయడం సరికాదని స్పష్టత ఇచ్చింది.


అదే సమయంలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్ పారదర్శకత లేనిదని, న్యాయ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని పేర్కొంటూ పిటిషనర్‌కు రూ.10 లక్షల జరిమానా విధించింది. దీంతో డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రచారంలో తమ ముఖ్యమంత్రి పేరు మరియు ఫోటోలను ఉపయోగించుకోవడానికి తిరిగి అనుమతి లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa