ప్రపంచాన్ని గతంలో కోవిడ్-19 భయపెట్టిన మాదిరిగానే.. ఇప్పుడు చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో చికున్‌గున్యా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ దోమల ద్వారా సంక్రమించే వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 7,000 కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితితో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం.. కరోనా సమయంలో అమలు చేసిన కఠినమైన నియంత్రణ చర్యలను తిరిగి ప్రవేశ పెట్టింది. ముఖ్యంగా ఈ వ్యాధి ప్రధాన కేంద్రమైన ఫోషాన్ నగరంలో అధికారులు అసాధారణమైన చర్యలు తీసుకుంటున్నారు. చికున్ గున్యా సోకిన రోగులకు క్వారంటైన్ నిబంధనలను తప్పనిసరి చేశారు. ఈ అసాధారణ నిర్ణయం చైనాలో మరోసారి ప్రజల మధ్య ఆందోళనలను పెంచుతోంది.
చైనా ప్రభుత్వం చేపట్టిన కఠినమైన చర్యల్లో భాగంగా.. చికున్‌గున్యా సోకిన రోగులను నిర్బంధంగా ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు. ఈ రోగులు పూర్తిగా కోలుకుని, పరీక్షల్లో నెగటివ్ అని నిర్ధారించబడే వరకు లేదా ఒక వారం పాటు ఆసుపత్రిలోనే ఉండేలా చేస్తున్నారు. అంతేకాకుండా దోమల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నందున.. రోగుల పడకలను దోమ తెరలతో కప్పి ఉంచుతున్నారు. ఈ క్వారంటైన్ నిబంధనలకు అదనంగా ఫోషాన్ నగరంలో ఫీవర్, దద్దుర్లు, కీళ్ల నొప్పుల కోసం మందులు కొనుగోలు చేసేవారు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యలు వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించి, దాని వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు.
చికున్‌గున్యా వైరస్ లక్షణాలు జ్వరం, దద్దుర్లు, కండరాల నొప్పులతో పాటు తీవ్రమైన కీళ్ల నొప్పులను కలిగిస్తాయి. ఈ కీళ్ల నొప్పులు కొందరిలో నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతోంది. ఈ వైరస్‌కు ప్రత్యేకమైన చికిత్స లేదా మందులు లేవు. దీనివల్ల, చికిత్స మొత్తం లక్షణాలను తగ్గించడంపైనే దృష్టి పెడుతుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, అధికారులు దోమల నియంత్రణకు భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా దోమల లార్వాలను తినే చేపలను ఫోషాన్ సరస్సుల్లో విడుదల చేశారు. అంతేకాకుండా డ్రోన్‌లను ఉపయోగించి దోమలు పెరిగే ప్రాంతాలను గుర్తించి మరీ వాటిని నిర్మూలిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో "ఏనుగు దోమలు" అని పిలిచే ఒక రకం దోమలను కూడా విడుదల చేశారు. ఈ ఏనుగు దోమలు మనుషులను కుట్టవు. కానీ అవి వ్యాధిని వ్యాప్తి చేసే ఇతర దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. ఒక లార్వా దాదాపు సాధారణ దోమల 100 గుడ్లను తినేస్తుంటుంది. అందుకే స్థానికంగా ఉండే కాల్వల్లో కూడా ఈ దోమలను వదులుతున్నారు. ఫలితంగా దోమల వ్యాప్తి చాలా వరకు తగ్గుతుందని చైనా సర్కారు భావిస్తోంది.
ఇటీవల గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో వచ్చిన భారీ వర్షాలు, వరదలతో దోమలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా వరదల వల్ల నిలిచిపోయిన నీరు దోమలు పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాయి. ఈ కారణంగానే వైరస్ ఇంత వేగంగా వ్యాపిస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన అమెరికా.. చైనాకు ప్రయాణించే పర్యాటకులకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం మీద చికున్ గున్యా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చైనా ప్రభుత్వం కఠినమైన బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa