ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేనేత మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 07, 2025, 06:40 PM

చేనేత కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధి పట్ల మంత్రి నారా లోకేశ్ చూపిన చిత్తశుద్ధి, పట్టుదల అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఓటమి పాలైనప్పటికీ మంగళగిరి ప్రజలను, ముఖ్యంగా నేతన్నలను అంటిపెట్టుకుని వారి కోసం పనిచేసిన లోకేశ్ కృషి వల్లే ఈరోజు ప్రభుత్వం చేనేతలకు మరింత మేలు చేయగలుగుతోందని అన్నారు. నేడు మంగళగిరిలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత వర్గానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ పలు కీలక వరాలను ప్రకటించారు.మంగళగిరిలో మంత్రి లోకేశ్ చొరవతో ఏర్పాటైన 'వీవర్‌శాల'ను సందర్శించిన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. "గత ఎన్నికల్లో ఓడిపోయినా మంగళగిరిని వీడకుండా, ఇక్కడి నేతన్నల కోసం లోకేశ్ నిరంతరం శ్రమించారు. ప్రతిపక్షంలో ఉండగానే 873 మందికి అత్యాధునిక రాట్నాలు అందించారు. 20 మగ్గాలతో వీవర్‌శాల ఏర్పాటు చేసి, 3,000 కుటుంబాలకు అండగా నిలవడం పేదల పట్ల, చేనేతల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఒకప్పుడు 5,000 ఓట్ల తేడాతో ఓడిన చోటే, ఈసారి 91 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం ఆయన సేవకు ప్రజలు ఇచ్చిన తీర్పు" అని చంద్రబాబు కొనియాడారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని చేనేత కళాకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ, ప్రతి చేనేత కుటుంబానికి 'నేతన్న భరోసా' పథకం కింద ఏటా రూ.25,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 93 వేల చేనేత, 50 వేల మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, దీనివల్ల ప్రభుత్వంపై ఏటా రూ.190 కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు.చేనేత ఉత్పత్తులపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ప్రభుత్వమే రీయింబర్స్‌ చేస్తుందని, దీనికోసం ఏటా రూ.15 కోట్లు కేటాయిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రూ.5 కోట్లతో పొదుపు నిధి (థ్రిఫ్ట్ ఫండ్) ఏర్పాటు చేసి 5,386 మంది కళాకారులకు ప్రయోజనం కల్పిస్తామన్నారు. చేనేత హక్కుల కోసం పోరాడిన యోధుడు ప్రగడ కోటయ్య జయంతిని ఇకపై అధికారికంగా నిర్వహిస్తామని, విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, దీని ద్వారా 40 వేల కుటుంబాలకు మేలు జరుగుతుందని ప్రకటించారు. త్వరలోనే 'ఆదరణ-3' పథకాన్ని ప్రారంభిస్తామని, గీత కార్మికులకు, వడ్డెరలకు, మత్స్యకారులకు, యాదవులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి బెదిరింపులకు లొంగకుండా కూటమికి అండగా నిలిచిన బీసీల సంక్షేమానికి తన చివరి శ్వాస వరకు పనిచేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa