కేంద్ర ఎన్నికల కమిషన్‌పై వరుస ఆరోపణలు చేస్తోన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మరోసారి ఈసీపై విరుచుకుపడ్డారు. ఈసీకి తాజాగా ఆయన ఐదు ప్రశ్నలు సంధించారు. డిజిటల్ ఓటర్ల జాబితాను ఎందుకు బహిర్గతం చేయడం లేదని, పోలింగ్ బూతుల్లో సీసీటీవీ కెమెరా రికార్డులను ఎందుకు తొలిగిస్తున్నారని నిలదీశారు. నకిలీ ఓటర్ల రిజిస్ట్రేషన్‌ను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని, ప్రతిపక్షాలను ఎన్నికల కమిషన్ భయపెడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీకి ఏజెంట్‌గా ఎన్నికల సంఘం మారిపోయిందా? అని రాహుల్ ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు బుదులివ్వాలని.. భారత ప్రజాస్వామ్యం ఎంతో విలువైందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాపై మరోసారి విరుచుకుపడ్డారు.
ఆగస్టు 7న మీడియా సమావేశంలో ఈసీపై ఆరోపణలు చేస్తూ.. ప్రజంటేషన్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని, పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ నకిలీ ఓటర్లతో బీజేపీకి లబ్ది చేకూర్చిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ పలు నివేదికలను రాహుల్ చూపించారు. దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించింది. ఏదైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, ఇంతవరకు రాహుల్ గాంధీ నుంచి అలాంటి ఫిర్యాదు తమకు ఏదీ అందలేదని పేర్కొంది.
రాజ్యాంగ విలువలను దెబ్బతీయడం, సంవిధానంపై దాడి చేసేటప్పుడు ఈసీ అధికారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన వారిని పట్టుకోవడానికి టైమ్ పట్టినా.. ఎప్పటికైనా దొంగలు దొరక్కపోరని, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాహుల్ స్పష్టం చేశారు. అంతేకాదు, తన ఆరోపణలపై ప్రమాణం చేయాలని ఈసీ డిమాండ్‌ను తోసిపుచ్చారరు. తాను ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగంపై ఎంపీగా ప్రమాణం చేశానని ఆయన గుర్తుచేశారు.
మరోవైపు, రాహుల్ గాంధీ ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలంటూ ఈసీ సవాల్ చేయడాన్ని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. మహారాష్ట్ర, హర్యానా సహా పలు రాష్ట్రాల ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపించిన వెంటనే స్పందించిన దర్యాప్తు చేయడం మానేసి.. రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దబాయిస్తుందని దుయ్యబట్టారు. అసలు దర్యాప్తే చేపట్టకపోతే ఆయన వాదనలు తప్పని ఎలా తెలుస్తుందని ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. తాము సమర్పించిన సాక్ష్యాలు ఈసీ ఎదుటే ఉన్నాయని.. వాటిని పరిణగణలోకి తీసుకొని దర్యాప్తు చేయాలని ప్రియాంక డిమాండ్ చేశారు. తమ ఆందోళన కేవలం ఒక పార్టీ గురించి మాత్రమే కాదని.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గురించని ఆమె వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa