లైంగికపరమైన కార్యక్రమాలకు అనుమతి తెలిపేందుకు ఇప్పటివరకు ఉన్న 18 ఏళ్ల వయో పరిమితిని తగ్గించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా ఒప్పుకోలేదు. 18 ఏళ్ల లోపు ఉన్న వారిని లైంగిక మోసాలు, లైంగిక దాడుల నుంచి రక్షించేందుకు.. ఈ 18 ఏళ్ల వయోపరిమితిని తీసుకువచ్చి.. కఠినంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. లైంగిక సమ్మతి వయసును తగ్గిస్తే.. అది తీవ్ర అనర్థాలకు దారి తీస్తుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే 18 ఏళ్లు దాటిన వారే లైంగిక చర్యకు సమ్మతి తెలిపేందుకు అర్హులు అనే నిబంధనను.. తాజాగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఇందులో వయో పరిమితిని తగ్గించడం కుదరదని తేల్చి చెప్పేసింది. లైంగిక సమ్మతి వయసును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీంకోర్టులో చేసిన వాదనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది.
ఈ వాదనకు స్పందనగా కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి లిఖిత పూర్వక సమాధానాన్ని సుప్రీంకోర్టుకు అందజేశారు. సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఇతర లైంగిక దాడుల నుంచి.. 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లను కాపాడేందుకే లైంగిక సమ్మతి వయసును చట్టపరంగా 18 ఏళ్లుగా నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కౌమార దశలో ఉన్న యువతీ యువకుల మధ్య లైంగిక సంబంధిత ప్రేమ పేరుతో ఈ వయోపరిమితిని 2 ఏళ్లు తగ్గించడం అనేది చట్టపరంగా వ్యతిరేకమే కాకుండా అది సమాజానికి కూడా ప్రమాదకరమని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి సుప్రీంకోర్టుకు వెల్లడించారు.
18 ఏళ్ల లోపు పిల్లల మౌనాన్ని, వారి ఎమోషన్స్‌ను ఆసరాగా చేసుకుని.. వారిపై లైంగిక దాడులకు పాల్పడే వారిని.. ఈ నిబంధన అడ్డుకుంటుందని.. ఒకవేళ వారు దాన్ని పట్టించుకోకుండా లైంగిక దాడులకు పాల్పడితే చట్టప్రకారంగా కఠిన శిక్షలు విధిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వయోపరిమితిని తగ్గించడం వల్ల.. దాన్ని ఆసరాగా చేసుకుని పిల్లలను అక్రమంగా రవాణా చేయడం, బాలలపై జరిగే నేరాలు విపరీతంగా పెరిగిపోతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఉన్న మైనర్లను రక్షించడమే తమ ప్రభుత్వానికి కీలకమని.. ఈ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని తేల్చి చెప్పింది.
లైంగిక వేధింపుల నుంచి మైనర్లను కాపాడేందుకు ఈ 18 ఏళ్ల వయోపరిమితి చాలా ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం వాదించింది. దీన్ని దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఈ లైంగిక సమ్మతి వయసును తగ్గిస్తే.. దేశంలో బాలల రక్షణ కోసం గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న కృషి నీరుగారిపోతుందని.. పోక్సో వంటి కఠిన చట్టాలు తీసుకురావడంలో అర్థం లేదని వెల్లడించింది. 18 ఏళ్ల లోపు వారికి లైంగిక సమ్మతిపై సరైన అవగాహన, పరిణతి ఉండవని పేర్కొన్న కేంద్రం.. దాన్ని తగ్గిస్తే వారికి పెను ముప్పుగా మారుతుందని కేంద్రం వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa