ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఒక సంఘటన అధికార పార్టీ బీజేపీకి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. సాధారణంగా అధికార పార్టీ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. కానీ తాజాగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు తీవ్ర వాగ్వాదానికి దిగారు. 'విజన్ 2047'పై చర్చ జరుగుతున్న సమయంలో.. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మొదలైన ఈ ఘర్షణ కొట్టుకునే వరకూ వెళ్లింది. కానీ ఇతర సభ్యులు జోక్యం చేసుకొని సర్దుబాటు చేయడంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‍గా మారింది.
అసలు గొడవకు కారణం ఏంటంటే?
మధుర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజేష్ చౌదరి, వారణాసి ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవ మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. అసెంబ్లీలో 'విజన్ 2047' అంశంపై అధికార పార్టీ తరపున ఎవరు మాట్లాడాలనే విషయంలో ఈ వివాదం మొదలైంది. చర్చలో మాట్లాడటానికి తన పేరును స్పీకర్‌కు పంపకుండా సౌరభ్ శ్రీవాస్తవ అడ్డుకున్నారని రాజేష్ చౌదరి ఆరోపించారు. ఈ విషయంలో చౌదరి తన సహచర ఎమ్మెల్యే శ్రీవాస్తవపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ముందుకు వెళ్లగా.. పరిస్థితి చేయి దాటిపోకుండా అరికట్టడానికి ఇతర సభ్యులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ హాల్లోనే వీరిద్దరూ తగువులాడుకోవడంతో.. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన అధికారిక 'ఎక్స్' ఖాతా వేదికగా షేర్ చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుల 'అమర్యాదపూర్వక ప్రవర్తన', 'అసభ్యకరమైన భాష' పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఇదేనా బీజేపీ నాయకుల సంస్కారం?" అని ప్రశ్నిస్తూ.. ప్రజాస్వామ్య వేదికలపై ఈ విధమైన ప్రవర్తన తగదని విమర్శించారు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షం ఈ అంశాన్ని ఒక అస్త్రంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమైంది.
అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలకు రాజేష్ చౌదరి అంతే ధీటుగా స్పందించారు. మతపెద్ద మౌలానా సాజిద్ రషీదీ.. అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ పట్ల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని చౌదరి ప్రశ్నించారు. డింపుల్ యాదవ్ బురఖా లేకుండా మసీదును సందర్శించడంపై మౌలానా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కుటుంబ గౌరవం విషయంలో అఖిలేష్ యాదవ్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దాడితో ఈ వివాదం మరింత జటిలంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa