దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కర్ణాటక ధర్మస్థల సామూహిక మృతదేహాల ఖననం ఘటనలో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. విజిల్ బ్లోయర్ ఇచ్చిన ఆధారాలు, చెప్పిన విషయాలతో ధర్మస్థల లో తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కేసును వెలుగులోకి తీసుకువచ్చిన ప్రధాన సాక్షి.. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. ధర్మస్థల ఆలయాన్ని పాలకుల ఆదేశాలతో ఒకే ప్రదేశంలో 70 నుంచి 80 మృతదేహాలను స్వయంగా తానే గొయ్యి తీసి పాతిపెట్టానట్లు అంగీకరించాడు. ధర్మస్థల ఆలయానికి సంబంధించి.. గతంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఆ సాక్షి.. కొన్ని రోజుల క్రితం బయటికి వచ్చి.. సంచలన విషయాలను బయటపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య శానిటైజేషన్ వర్కర్‌గా పనిచేసిన ఆ వ్యక్తి.. ఆ సమయంలో తాను కొన్ని వందల మృతదేహాలు ఖననం చేసినట్లు వెల్లడించడం దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది.
అయితే ఎలాంటి మరణ ధ్రువీకరణ పత్రాలు (డెత్ సర్టిఫికెట్) లేకుండానే నేత్రావతి నది ఒడ్డున ధర్మస్థల అటవీ ప్రాంతంలో తాను ఒక్కడినే చాలా శవాలను గొయ్యితీసి పాతిపెట్టినట్లు ఆ ప్రధాన సాక్షి తెలిపాడు. గత 20 ఏళ్లలో ధర్మస్థల ఆలయ పర్యవేక్షకులు తనపై ఒత్తిడి తీసుకురావడంతో చిన్న పిల్లలు, మహిళలు సహా చాలా మంది మృతదేహాలను తానే పూడ్చి పెట్టినట్లు ధర్మస్థల పోలీసులకు ఆ ప్రధాన సాక్షి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటికి వచ్చింది. ఈ వ్యవహారంపై కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసి.. విచారణ జరిపిస్తోంది.
ఇప్పటివరకు ధర్మస్థలలో ప్రధాన సాక్షి చూపించిన 15 ప్రాంతాల్లో సిట్ అధికారులు తవ్వకాలు జరిపించగా.. సైట్ నంబర్ 6లో మాత్రమే ఓ మానవ అస్థిపంజరం లభించింది. సైట్ నంబర్ 13లో తాను 70 నుంచి 80 మృతదేహాలను పాతిపెట్టినట్లు వెల్లడించాడు. భూమి లోపల చాలా లోతుగా తవ్వి మృతదేహాలు పాతిపెట్టినట్లు చెప్పాడు. స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నేరుగా ధర్మస్థల ఆలయ పాలకులే ఆదేశాలు జారీచేసేవారని పేర్కొన్నాడు. అంతేకాకుండా అటవీ ప్రాంతాలు, పాత రోడ్లపైన మాత్రమే మృతదేహాలను పాతిపెట్టేవాళ్లమని.. ఎప్పుడూ శ్మశాన వాటికల్లో పాతిపెట్టలేదని చెప్పాడు. ఆలయ పాలకులు చెప్పిన చోటే తవ్వి పూడ్చిపెట్టేవాళ్లమని వివరించాడు.
ఇక చనిపోయిన వారిపై లైంగిక దాడులు జరిగినట్లు స్పష్టమైన ఆనవాళ్లు కనిపించాయని ఆ సాక్షి పేర్కొన్నాడు. దాదాపు 100 శవాలను తమ టీమ్ పాతిపెట్టిందని.. అందులో 90 మహిళల మృతదేహాలే ఉన్నట్లు వివరించాడు. ధర్మస్థల ఆలయ మేనేజర్ ఎప్పుడూ తనను నేరుగా పిలవలేదని.. అతని వద్ద ఉండే వ్యక్తి ద్వారానే ఆదేశాలిచ్చేవారని చెప్పాడు. వర్షాలతో భూమి కోతకు గురికావడం, అడవులు పెరిగిపోవడం, నిర్మాణ పనుల కారణంగా పాతిపెట్టిన కొన్ని ప్రదేశాలను గుర్తించలేకపోయినట్లు తెలిపాడు. పగటి సమయంలో తాము శవాలను పాతిపెట్టినపుడు కొందరు స్థానికులు చూసినా.. ఎవరూ ఆపలేదని, ప్రశ్నించలేదని పేర్కొన్నాడు.
శవాల మీది నగలను తాను దోచుకుని ధర్మస్థల ఆలయ పవిత్రతను అప్రతిష్ట పాలు చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. అయితే అవన్నీ తప్పని విజిల్ బ్లోయర్ వెల్లడించాడు. ఆలయ ప్రతిష్టను నాశనం చేస్తే తనకు ఏమొస్తుందని ప్రశ్నించాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ విషయం ఎందుకు బయటపెట్టానని అందరూ తనను ప్రశ్నిస్తున్నారని.. అయితే చేసిన తప్పులు తనను వెంటాడుతున్నాయని.. కలలో కూడా అస్థిపంజరాలు కనిపిస్తున్నాయని చెప్పాడు.
పాతిపెట్టిన మృతదేహాలు, వాటి అవశేషాలను వెలికితీసేందుకు సిట్ అధికారులు మరింత విస్తృతంగా తవ్వకాలు చేపడతారని తాను నమ్ముతున్నట్లు ప్రధాన సాక్షి వెల్లడించాడు. వారు తనను నమ్ముతున్నట్లు అనిపించకపోయినా.. తాను మాత్రం వారిని నమ్ముతానని స్పష్టం చేశాడు. 10, 15 ఏళ్ల క్రితం ఉన్న పరిసరాలు ఇప్పుడు ఆ అటవీ ప్రాంతంలో లేవని.. అయినప్పటికీ తనకు ఉన్న జ్ఞాపకశక్తితో తాను వాటిని చూపిస్తున్నట్లు వివరించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa