ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గతంలో వామపక్ష భావజాలంతో చరిత్రను రాశారన్న మాజీ డైరెక్టర్ రాజ్‌పుత్

national |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 07:31 PM

స్వాతంత్ర్యం సాధించిన ఘనతను పూర్తిగా తమ ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, దేశ విభజన బాధ్యతను కూడా స్వీకరించాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి  మాజీ డైరెక్టర్ జే.ఎస్. రాజ్‌పుత్ అన్నారు. దేశ విభజన విషయంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా బాధ్యత వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.ప్రతి సంవత్సరం ఆగస్టు 14న పాటించే 'పార్టిషన్ హారర్ రిమెంబరెన్స్ డే' సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన కొత్త పాఠ్యాంశం వివాదానికి దారితీసింది. దేశ విభజనకు ముగ్గురు ముఖ్య కారకులున్నారని, అందులో ఒకరు పాకిస్థాన్ కావాలన్న మహమ్మద్ అలీ జిన్నా కాగా, రెండోది అందుకు అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ అని, మూడోది దానిని అమలు చేసిన నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ అని ఆ పాఠ్యాంశంలో పేర్కొన్నారు.ఈ పాఠ్యాంశంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ, ఇది చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని, హిందూ మహాసభ, ముస్లిం లీగ్ మధ్య ఉన్న సంబంధాల వల్లే దేశ విభజన జరిగిందని ఆరోపించారు. దేశంలోని లౌకికవాదాన్ని నిర్మూలించాలని చూస్తున్న ఆరెస్సెస్ ఈ దేశానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం జే.ఎస్. రాజ్‌పుత్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు."చరిత్రను సవరించినప్పుడు విమర్శలు రావడం సహజం. స్వాతంత్ర్య ఉద్యమం ఘనతను కాంగ్రెస్ తీసుకుంటుంది కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి విప్లవకారుల పాత్రను మాత్రం ప్రస్తావించదు. ఇది వారి ద్వంద్వ వైఖరిని చూపిస్తుంది. కాంగ్రెస్ కాస్త ముందుగా మేల్కొని ఉంటే దేశ విభజనను నివారించగలిగేవారు" అని రాజ్‌పుత్ అభిప్రాయపడ్డారు.గతంలో పాఠ్యపుస్తకాల రూపకల్పనలో వామపక్ష భావజాలం ప్రభావం ఎక్కువగా ఉండేదని ఆయన విమర్శించారు. "భారత్‌లో రెండు రకాల చరిత్రకారులు ఉన్నారు. ఒకటి వామపక్షవాదులు, రెండోది మిగిలినవారు. స్వాతంత్ర్యం తర్వాత వామపక్ష భావజాలంతోనే చరిత్రను మన తరాలకు బోధించారు. ఈ రోజు మార్పులను వ్యతిరేకిస్తున్నది కూడా వారే" అని ఆయన పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు పూర్తి అవగాహన లేకుండానే చరిత్రపై మాట్లాడుతున్నారని, వాస్తవాల ఆధారంగానే చరిత్రను విద్యార్థులకు అందించాలని ఆయన హితవు పలికారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశంలో పేర్కొన్న విషయాలు వాస్తవమని తాను నమ్ముతున్నట్లు రాజ్‌పుత్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa