రష్యాతో యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్ రెండు కీలకమైన అంశాలను వదులుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా ఆక్రమించిన క్రిమియాను తిరిగి దక్కించుకోవాలనే ఆలోచనను, నాటో కూటమిలో చేరాలనే ఆశను విరమించుకుంటే యుద్ధం దాదాపు తక్షణమే ముగిసిపోతుందని ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సూచించారు. ఈ రోజు జెలెన్‌స్కీ, పలువురు ఐరోపా అగ్రనేతలతో వైట్‌హౌస్‌లో జరగనున్న అత్యంత కీలక సమావేశానికి ముందు ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఆదివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. "ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తలుచుకుంటే యుద్ధాన్ని వెంటనే ఆపవచ్చు. లేదా పోరాటాన్ని కొనసాగించవచ్చు. కానీ ఒబామా హయాంలో కోల్పోయిన క్రిమియా తిరిగి రాదు. ఉక్రెయిన్ నాటోలో చేరలేదు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు" అని ఆయన పేర్కొన్నారు. ఈ షరతులు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పటినుంచో పెడుతున్న డిమాండ్లకు దగ్గరగా ఉండటంతో ఐరోపా దేశాల్లో ఆందోళన మొదలైంది.సోమవారం జెలెన్‌స్కీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మనీ నేత ఫ్రెడ్రిక్ మెర్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ వంటి అగ్రనేతలు వైట్‌హౌస్‌కు రానున్నారు. ఈ భేటీలో పుతిన్ షరతులను అంగీకరించేలా జెలెన్‌స్కీపై ట్రంప్ ఒత్తిడి తీసుకురావొచ్చని వారు ఆందోళన చెందుతున్నారు. శాంతి ఒప్పందంలో భాగంగా అమెరికా ఎలాంటి భద్రతా హామీలు ఇస్తుందనే దానిపై స్పష్టత కోరాలని ఐరోపా నేతలు భావిస్తున్నారు.ఇటీవలే అలస్కాలో ట్రంప్, పుతిన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత యుద్ధ విరమణ కాకుండా పూర్తిస్థాయి శాంతి ఒప్పందంపై దృష్టి పెట్టినట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతం దొనెట్స్క్, లుహాన్స్క్పూ ర్తి నియంత్రణను రష్యాకు అప్పగించి, బదులుగా దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో రష్యా దాడులను నిలిపివేయాలనే ప్రతిపాదనను ట్రంప్ సమర్థించినట్లు సమాచారం.ఈ పరిణామాలపై జెలెన్‌స్కీ స్పందిస్తూ, పుతిన్ ఇచ్చే హామీల కంటే ట్రంప్ ఇచ్చే భద్రతా హామీలే తమకు ముఖ్యమని అన్నారు. మరోవైపు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ, రష్యా ప్రతిపాదిస్తున్న శాంతి కేవలం ఉక్రెయిన్ లొంగిపోవడమే అవుతుందని విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. ఏదేమైనా, ఈ రోజు జరగనున్న వైట్‌హౌస్ సమావేశం ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa