ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో నారా లోకేష్ సోమవారం భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, జైశంకర్, హర్దీప్ సింగ్ పూరీలతో నారా లోకేష్ భేటీ అయ్యారు. విదేశాంగ మంత్రి జైశంకర్‍తో భేటీ సందర్భంగా నారా లోకేష్ డేటా సిటీ ప్రస్తావన తీసుకువచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు, వివిధ అంతర్జాతీయ కంపెనీలను ఏపీకి ఆహ్వానించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి ఓ బృందం ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ సహా పలువురు ఉన్నతాధికారులతో కూడిన బృందం ఇటీవల సింగపూర్‌లో పర్యటించింది. ఈ పర్యటన తాలూకు వివరాలను నారా లోకేష్.. విదేశాంగ మంత్రి జైశంకర్‌కు వివరించారు. సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల సారాంశాన్ని వివరించారు.
ఈ క్రమంలోనే సాగర తీరం విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నారా లోకేష్ కోరారు. రాష్ట్రం నుంచి ఎంతో మంది యువత విదేశాల్లో కొలువుల కోసం వెళ్తుంటారని.. అలాంటి వారికి సాఫ్ట్ స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇచ్చేందుకు గానూ విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రి జైశంకర్‌కు నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి , ప్రగతికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని జైశంకర్ హామీ ఇచ్చారు.మరోవైపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన నారా లోకేష్.. ఏపీలో బీపీసీఎల్ సంస్థ నిర్మించే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ త్వరితగతిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ నెలకొల్పుతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నారు నారా లోకేష్. ఫిబ్రవరిలో ఢిల్లీలో పర్యటించిన సందర్భంగానూ నారా లోకేష్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసే డేటా సిటీకి సహకారంతో పాటుగా ఏపీలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఐదేళ్లల్లో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్.. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. భవిష్యత్తులో ఏఐకు ప్రాధాన్యం పెరుగుతుందని, ఆ రంగంలో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయనే నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం ఏఐ రంగం మీద ప్రత్యేక దృష్టి సారించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa