ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమిళనాడుకు చెందిన సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడంతో ఇండియా కూటమిలోని డీఎంకే ఇరకాటంలో పడింది. అయితే, అనూహ్యంగా విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శనరెడ్డి పేరును ప్రకటించి బీజేపీ వ్యూహానికి కౌంటర్ ఇచ్చాయి. ఈ నిర్ణయం ఎన్డీయేలో కీలక మిత్రపక్షమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని సందిగ్ధంలోకి నెట్టింది. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన టీడీపీకి ఇప్పుడు డీఎంకే మాదిర పరిస్థితే ఎదురయ్యింది. స్థానిక అభ్యర్థికి వ్యతిరేకంగా టీడీపీ ఓటు వేసి ఎన్డీఏ కూటమికి కట్టుబడి ఉంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి హైకోర్టు లాయర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1995లొ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదేళ్ల తర్వాత ఆయన గువహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. ఆ తర్వాత జనవరి 2007లో పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై.. జులై 2011 వరకూ ఆ పదవిలో కొనసాగారు. పదవీ విరమణ అనంతరం గోవా రాష్ట్రానికి మొట్టమొదటి లోకాయుక్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ ఎంపిక చేసి ఏంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేను సందిగ్ధతలో పడేసింది. తమిళుడు అనే సెంటిమెంట్‌ను లేవనెత్తి.. రాజకీయాలకు అతీతంగా ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని డీఎంకేపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. కానీ, బీజేపీ ఎంపిక భాషాభిమానం ద్వారా కాకుండా రాజకీయంగా చూడాలని డీఎంకే స్పష్టం చేసింది.
ప్రస్తుతం విపక్ష అభ్యర్ధిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అలాంటి సంకటస్థితి ఎదురయ్యింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది. సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీయే అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత మంత్రి నారా లోకేశ్ కలిసి.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ, జస్టిస్ రెడ్డి పేరును విపక్షం ప్రకటించడంతో టీడీపీ మద్దతు తెలుగు న్యాయమూర్తికా? లేక తమిళ రాజకీయ నాయకుడికా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్డీఏ కూటమికి టీడీపీ కట్టుబడి ఉంటే రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఎన్డీయే అభ్యర్థికి మద్దతు విషయంలో వైఎస్ఆర్‌సీపీ, బీఆర్ఎస్ పార్టీలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ, కే. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి ఇప్పుడు ప్రతిపక్షాలతో తమ విభేదాలను పక్కనబెట్టి రిటైర్డ్ న్యాయమూర్తికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఉప-రాష్ట్రపతి ఎన్నికల్లో సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం బీజేపీకే మొగ్గు ఉంది. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడి ఎలక్ట్రోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ప్రస్తుతం ఎలక్ట్రోల్ కాలేజీలో ఖాళీలను మినహాయిస్తే 782 మంది సభ్యులు ఉండగా.. కనీసం 392 ఓట్లు సాధించిన అభ్యర్థే విజేతగా నిలుస్తారు. ఎన్డీయేకు లోక్‌సభలో 293, రాజ్యసభలో 133 మంది ఉండటంతో బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుంది. ఎన్డీయేలోని ఎవరైనా ప్రతిపక్ష అభ్యర్ధికి ఓటు వేస్తేనే పరిస్థితులు మారతాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు విపక్షం గండికొట్టింది. ఎన్నికల్లో అక్రమాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో ఐక్యతను ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాదు, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న సమయంలో అత్యున్నత పదవికి రాజకీయేతర అభ్యర్థిని ఎంపిక చేయడం ద్వారా సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికను సైద్ధాంతిక యుద్ధంగా మార్చాలని సందేశాన్ని ఇండియా బ్లాక్ పంపినట్టయ్యింది. బీజేపీకీ మెజార్టీ ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల ఎంపిక నిస్సందేహంగా ఉప-రాష్ట్రపతి ఎన్నిక పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa