ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ పర్యటన నుంచి రాగానే.. ఏపీకి కేంద్రం మరో తీపికబురు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 07:40 PM

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనుకున్నది సాధించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లి చొరవ తీసుకుని మరీ కేంద్రమంత్రుల్ని కలిసి నిధులు కోరారు. అయితే లోకేష్ ప్రయత్నాలు ఫలించాయి.. ఏపీకి కేంద్రం తీపికబురు చెప్పింది.. భారీగా నిధులు మంజూరు చేసింది. కేంద్రం విద్యా రంగానికి భారీగా నిధులు విడుదల చేసింది.. ఈ విద్యా సంవత్సరానికి కేంద్రం నుంచి రాష్ట్ర విద్యాశాఖకు నిధులు మంజూరయ్యాయి. సమగ్ర శిక్షణ కోసం గతంలో కంటే అదనంగా రూ.432.19 కోట్ల నిధులను మంజూరయ్యాయి. మంత్రి లోకేష్ చొరవతో కేంద్రం రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెబుతున్నారు.


కేంద్రం ముఖ్యంగా సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల అభివృద్ధికి రూ.167.46 కోట్లు కేటాయించింది. ఐసీటీ ల్యాబ్స్, స్మార్ట్ తరగతులు, సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటు కోసం ఈ నిధులు ఉపయోగపడతాయి.. పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్స్ అంటే కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ తరగతుల ద్వారా డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తుంది. సైన్స్ ల్యాబ్‌లతో విద్యార్థులు ప్రయోగాలు చేయవచ్చు. డైట్ కళాశాలలను అభివృద్ధి చేయడానికి కూడా రూ.43.23 కోట్లు మంజూరు చేసింది. డైట్ కళాశాలలు సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మారడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. గతంలో ఈ కాలేజీలకు 50 శాతం నిధులే వచ్చేవి.. కానీ ఈసారి 96 శాతం నిధులు వచ్చాయి. వీటితో పాటుగా ఆదివాసీ విద్యార్థుల వసతి గృహాల కోసం రూ.11 కోట్లు విడుదల చేసింది. ఆదివాసీ విద్యార్థులకు వసతి గృహాలు మెరుగుపరచడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.


మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మాత్రమే కాదు.. పలు శాఖలకు సంబంధించి పలువురు కేంద్రమంత్రుల్ని కలిసి ఏపీకి నిధులు కేటాయించలని కోరారు. 'న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాను. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించాను. ఏపీలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారికి విజ్ఞప్తిచేశాను' అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.


మంత్రి నారా లోకేష్, టీడీపీ ఎంపీలతో కలిసి ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్ధవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనతో అనుకున్నది సాధించారు.. కేంద్రానికి చెప్పి ఏపీకి నిధులు మంజూరు చేయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa