ఇటీవల అలస్కాలో భేటీ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌వైపు డొనాల్డ్ ట్రంప్ చూపిస్తోన్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో.. ఆ పక్కనే 1959లో మాస్కో వేదిక జరిగిన ‘కిచెన్ డిబేట్’ సమయంలో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్.. సోవియట్ ప్రధాని నికితా క్రుష్బేవ్ కళ్లలోకి చూస్తూ చూపుడు వేలితో గుచ్చుతూ మాట్లాడిన ఫోటో.. ఈ రెండింటిని అమెరికా అధ్యక్షుడు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పంచుకున్నారు. 60 సంవత్సరాల కిందట అమెరికా, రష్యాల మధ్య జరిగిన సంఘటనను ప్రస్తుతం అలస్కా భేటీని పోల్చిన ట్రంప్.. హిస్టరీ రిపీట్ అయ్యిందని అన్నారు.
ట్రంప్ తరచుగా తనను తాను రిచర్డ్ నిక్సన్‌తో పోల్చుకుంటూ, రాజకీయాల్లో ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నట్టు చెబుతారు. నిక్సన్ పట్ల ఆయనకు అభిమానం 1980 నుంచి మొదలైంది. తన టవర్‌లో ఉండమని నిక్సన్‌ను ట్రంప్ ఆహ్వానించడమే కాకుండా, వియత్నాం యుద్ధాన్ని ఆయన నిర్వహించిన తీరును ప్రశంసించారు.
కాగా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు, శాంతి ఒప్పందంపై చర్చించేందుకు గతవారం అలస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య భేటీ జరిగింది. అయితే, ఎటువంటి ఒప్పందం లేకుండానే ఈ భేటీ ముగిసింది. అత్యంత అట్టహాసంగా ఈ భేటీ నిర్వహించిన తీరు, పుతిన్ పట్ల ట్రంప్ ప్రదర్శించిన అనుబంధం విమర్శలకు దారితీసింది.
ఆరు దశాబ్దాల కిందట మాస్కోలోని సోకోల్నికి పార్క్‌లో జరిగిన అమెరికన్ నేషనల్ ఎగ్జిబిషన్ సందర్భంగా నిక్స్, క్రుష్బేవ్‌లు కలిశారు. సోవియట్ పౌరులకు పెట్టుబడిదారీ ప్రయోజనాలను కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. డిష్‌వాషర్, రిఫ్రిజిరేటర్, ఆర్సీఏ కలర్ టెలివిజన్ వంటి ఆధునిక ఉపకరణాలతో కూడిన ఇంటిని అమెరికా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసింది. గృహోపకరాల ప్రదర్శనగా ప్రారంభమైన ఈ కార్యక్రమం.. తర్వాత కమ్యూనిజం భావజాలం, సాంకేతిక పురోగతిపై చర్చకు దారితీసింది.
ఈ ఉపకరణాలు అందరికీ అందుబాటులో ఉంటాయని, 14,000 అమెరికా డాలర్లు విలువైన ఈ ఇంటిని సాధారణ కార్మికుడు ప్రభుత్వ మద్దతు, ఆర్థిక సహాయంతో కొనుగోలు చేయవచ్చని నిక్సన్ అన్నారు. దీనికి క్రుష్చెవ్ స్పందిస్తూ, సోవియట్ పౌరులు త్వరలో ఇలాంటి సౌకర్యాలను అనుభవిస్తారని, అమెరికన్ వినియోగ వస్తువుల ప్రాముఖ్యతను ప్రశ్నించారని అన్నారు. పెట్టుబడిదారీ విధానం వర్సెస్ కమ్యూనిజంగా మొదలైన చర్చ.. చివరకు అంతర్జాతీయ శక్తిసమతౌల్యతకు విస్తరించింది.
వాదోపవాదాల్లో మహిళల సామాజిక పాత్ర సహా వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఇంట్లో మహిళల శ్రమను మరింతగా తగ్గించి, వారిని ఉద్యోగ రంగంలో భాగస్వామ్యం చేయడానికి ఇవి తోడ్పడతాయని నిక్సన్ వ్యాఖ్యానించారు. దానికి క్రుష్భేవ్.. సోవియట్ యూనియన్ లింగసమానత్వానికి కట్టుబడి ఉందని, తమ దేశంలోని మహిళలు అప్పటికే అన్ని రంగాల్లో రాణిస్తున్నారని బదులిచ్చారు.
ఈ వాదన తీవ్రస్థాయికి చేరడంతో నిక్సన్ తన వేళ్లను క్రుష్చేవ్ వైపు గుచ్చుతూ అమెరికా విలువలను బలంగా వ్యక్తం చేశారు. ఆ క్షణాన్ని ఫోటోగ్రాఫర్ ఎలియట్ ఎర్విట్ బంధించగా.. అది అమెరికా-రష్యాల మధ్య కోల్డ్‌వార్ తీవ్రతకు అద్దం పట్టిందని విస్తృతంగా ప్రసారం చేశారు. దానికి భిన్నంగా ప్రస్తుతం పుతిన్ వైపు ట్రంప్ చమత్కారంగా, సరదాగా వేలెత్తి చూపించారు. ఈ రెండింటిని జతచేసి సోషల్ మీడియాలో పెట్టారు. అలాస్కా భేటీలో ఉక్రెయిన్ డోనట్క్స్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ వెనక్కి తగ్గాలని, అలాగే ఉక్రెయిన్ భూభాగం నుంచి పశ్చిమ దేశాల సైన్యాలు వెళ్లిపోవాలని పుతిన్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa