ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్య ఉంటే కొనడం మానేయండి, : అమెరికాకు జైశంకర్ గట్టి వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 09:20 PM

భారత్-అమెరికా సంబంధాలు, వాణిజ్య విధానాలు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి వంటి కీలక అంశాలపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ది ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2025’లో పాల్గొన్న జైశంకర్.. అగ్రరాజ్యానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా భారత్ నుంచి చమురు, శుద్ధి చేసిన ఉత్పత్తులు కొనడంలో అమెరికాకు ఏమైనా సమస్య ఉంటే.. వాటిని కొనడం మానేయాలని సూచించారు. దీనిపై ఎవరూ ట్రంప్‌ను బలవంత పెట్టడం లేదని అన్నారు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించే విధానాలు సాంప్రదాయక దౌత్యానికి పూర్తి భిన్నంగా ఉంటాయని, వాటి ప్రభావం ప్రపంచ దేశాలపై గణనీయంగా ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగానే... భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎప్పుడూ రాజీపడదని గట్టిగా చెప్పారు. ముఖ్యంగా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50 శాతం వరకు సుంకాలను విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనపై జైశంకర్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో భారత్ తన విధానాన్ని చాలా స్పష్టంగా చెప్పిందని.. దేశ రైతులు, చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. "భారతీయ రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన అవసరం ఉందా లేదా అని ఎవరికైనా అనుమానం ఉంటే.. వారు ప్రజల ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పవచ్చు" అని సవాలు విసిరారు.


"తాము వ్యాపార అనుకూల ప్రభుత్వం అని చెప్పుకునే అమెరికా పాలనా యంత్రాంగం, ఇతరులు వ్యాపారం చేస్తున్నారని ఆరోపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది" అని జైశంకర్ ఎద్దేవా చేశారు. అలాగే భారత్ తన వాణిజ్య విధానాల్లో ఎటువంటి వెనుకడుగు వేయదని, తన ప్రజల ప్రయోజనాలను గట్టిగా కాపాడుకుంటుందని అమెరికాకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నుంచి నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులు తగ్గించాలని అమెరికా, దాని మిత్ర దేశాలు భారత్‌పై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. భారత్ తన వైఖరిని మార్చుకోలేదని గుర్తు చేశారు.


భారత్ నుంచి చమురు లేదా శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో మీకు సమస్య ఉంటే.. దాన్ని కొనడం మానేయవచ్చని జైశంకర్ కుండబద్దలు కొట్టారు. కొనమని ఎవరూ మిమ్మల్ని బలవంతం చేయడం లేదని కూడా వివరించారు. రష్యా నుంచి చమురు కొనాలన్న భారత్ నిర్ణయం ఆర్థిక భద్రత, దేశీయ ఇంధన అవసరాలపై ఆధారపడి ఉందని.. ఇది ఏ ఇతర దేశం సూచనల మేరకు తీసుకోబడింది కాదని జైశంకర్ పునరుద్ఘాటించారు. అంతకుముందు మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన నాలుగు రోజుల వివాదంపై అమెరికా జోక్యం చేసుకుందని ట్రంప్ చేసిన ఆరోపణలను కూడా జైశంకర్ పూర్తిగా తోసిపుచ్చారు. "భారత్-పాకిస్థాన్ సంబంధాలలో మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ అంగీకరించదన్నారు. గతంలోనూ అనేక సందర్భాల్లో అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించినా.. భారత్ ఎప్పుడూ దాన్ని ఒప్పుకోలేదని ఆయన వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa