భారత్‌తో చర్చలకు తమ దేశం సిద్ధంగానే ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని అయిన ఇషాక్ దార్ వెల్లడించారు. అయితే ఈ చర్చలు గౌరవప్రదమైన, మర్యాద పూర్వకమైన వాతావరణంలో జరగాలని స్పష్టం చేశారు. కశ్మీర్ సహా అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. అయితే చర్చల కోసం తమ దేశం భారత్‌ను ఎన్నటికీ బ్రతిమాలదని ఆయన నొక్కి చెప్పారు.
గతంలో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, ముఖ్యంగా చర్చల ప్రక్రియ నిలిచిపోయిన నేపథ్యంలో ఇషాక్ దార్ చేసిన ఈ ప్రకటనకు దౌత్యపరమైన ప్రాధాన్యత ఏర్పడింది. ఈ చర్చలు ఏకపక్షంగా కాకుండా.. ఉభయ దేశాలకు ఆమోదయోగ్యమైన రీతిలో జరగాలని పాకిస్థాన్ ఆకాంక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంలో నిమగ్నమైనప్పటికీ.. భారత్‌తో స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు తాము సుముఖంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తో శాంతి, సుస్థిరత కోరుకుంటున్నామని.. అయితే అది పరస్పర గౌరవం, సార్వభౌమాధికారానికి భంగం కలగకుండా ఉండాలని ఇషాక్ దార్ పేర్కొన్నారు.
భారత్ మాత్రం పాకిస్థాన్‌తో చర్చల విషయంలో చాలా స్పష్టమైన వైఖరిని అవలంభిస్తోంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పూర్తిగా ఆపితేనే చర్చలు సాధ్యమని భారత్ అనేక సందర్భాల్లో పునరుద్ఘాటించింది. భారతదేశం ప్రకారం పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తమ దేశ ప్రభుత్వ విధానంగా ప్రోత్సహించడం ఆగిపోనంత వరకు శాంతి చర్చలు ఫలవంతం కావని అభిప్రాయ పడింది. పాకిస్థాన్‌తో ఒకే ఒక అంశంపై చర్చలకు భారత్ సిద్ధంగా ఉందని, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి పొందడం గురించి మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇషాక్ దార్ చేసిన ప్రతిపాదనకు భారత్ ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.
పాకిస్థాన్‌కు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అంటే 2003లో "సమగ్ర సంభాషణలు" అనే పేరుతో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇందులో భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న అన్ని వివాదాస్పద అంశాలను.. ఎనిమిది భాగాలుగా మార్చారు. అయితే 2008లో ముంబైపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడుల తర్వాత ఈ చర్చల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ పూర్తి స్థాయిలో ఈ చర్చలను పునరుద్ధరించలేకపోయారు.
ఇర ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌పై పగ తీర్చుకుంది. ముఖ్యంగా అక్కడి ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా.. పాక్ కూడా ప్రతిదాడులకు పాల్పడింది. నాలుగు రోజులు తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణకు వచ్చాయి. ఆ తర్వాత నుంచి పాక్ పదే పదే తాము చర్చలకు సిద్ధం అని ప్రకటిస్తూ వస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa