ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నానమ్మ, తాతయ్య, ముత్తమ్మల దగ్గర నుంచి పిన్ని, బాబాయి, అత్త, మామ సహా అనేక మంది ఇంట్లో ఉండేవాళ్లు. వీరంతా పిల్లలను చూసుకుంటూ ప్రేమను పంచేవాళ్లు. అలాగే వారికి ఎన్నెన్నో మంచి విషయాలను నేర్పించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కన్నవాళ్లను వృద్ధాశ్రమాల్లో పడేస్తూ.. తమకు పుట్టిన వాళ్లను మాత్రమే తమతో ఉంటుకుంటూ జీవిస్తున్నారు. ఫలితంగా చిన్న చిన్న కుటుంబాలు ఎక్కువయ్యాయి. ఈ ఇళ్లల్లో భార్యాభర్తలు వారి పిల్లలు తప్ప మరెఎవరూ ఉండట్లేదు. ఒక్కరే సంతానం ఉన్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోగా.. ఫలితంగా చిన్నారుల్లో ఒంటరితనం ఏర్పడుతోంది. అమ్మా, నాన్నలు తమ పనుల్లో బిజీగా ఉండి ఆ ఉన్న ఒక్కరిని కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి.
మరోవైపు వృద్ధాశ్రమల్లో ఉంటున్న వాళ్లు కూడా మనవళ్లు, మనవరాళ్లకు దూరమయ్యామని బాధ పడుతున్నారు. ఎప్పుడూ వారినే తలుచుకుంటూ నరకం చూస్తున్నారు. ఈ సమస్యలు అన్నీ అర్థం చేసుకున్న ఓ వృద్ధాశ్రమం ఈ సమస్యకు చెక్ పెట్టబోతుంది. ముఖ్యంగా అద్దెకు వృద్ధులను ఇస్తూ.. ఇటు పెద్దల్లో, అటు పిల్లల్లో ఒంటరితనాన్ని పోగొట్టాలని ప్లాన్ చేస్తోంది. అలాగే అద్దెకివ్వగా వచ్చిన డబ్బును వాళ్ల ఖర్చులకే ఉపయోగిస్తూ ఆర్థికంగా కూడా సాయం చేస్తోంది. మరి ఈ కొత్త స్కీమ్ తెచ్చిన వృద్ధాశ్రమం ఎక్కడుంది, నెలకు ఎంత డబ్బులు తీసుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృద్ధులను అద్దెకు ఇచ్చే కాన్సెప్ట్‌ను జపాన్ ప్రారంభించింది. అక్కడ చాలా వృద్ధాశ్రమాలు పిల్లల్లో, వృద్ధుల్లో ఒత్తిడిని పోగొట్టేందుకు ఈ కార్యక్రమం చేపడుతుండగా.. భారత్ కూడా కొత్తగా దీన్ని ప్రారంభించింది. ముఖ్యంగా దేశంలోనే మొట్ట మొదటిసారి ఆగ్రా నగరంలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం ఈ వినూత్న కార్యక్రమాన్ని అవలంభిస్తోంది. ఇది కేవలం ఆర్థికపరమైన లావాదేవీ మాత్రమే కాదని.. అంతకు మించి లోతైన భావోద్వేగాలను పంచుకునే ఒక మానవతా కార్యక్రమమని ఆశ్రమం నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పథకం కింద ఒక కుటుంబం అద్దెకు వృద్ధులను తీసుకెళ్లాలనుకుంటే.. ముందుగా రూ. 11 వేలు డిపాజిట్ చేయాలి. ఈ మొత్తంలో కొంత భాగం వృద్ధులకు వ్యక్తిగత ఖర్చుల కోసం అందజేస్తారు. మిగిలిన మొత్తాన్ని వృద్ధాశ్రమం నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఈ విధానం వల్ల పిల్లలు, యువత వృద్ధుల అనుభవాల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటారు. వారికి సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు తెలుస్తాయి.
అంతేకాకుండా ఇటు వృద్ధులకు కూడా తమ జీవితం ఉపయోగపడుతుందన్న సంతృప్తి లభిస్తుంది. ఒంటరిగా ఉన్న వారికి తోడు దొరుకుతుంది. ఇది తమ మనవళ్లు, మనవరాళ్లను దూరమైన భావనను కోల్పోయేలా చేసి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. అలాగే జీవితంపై వారికి ఆశను కలిగిస్తుంది. అయితే ఈ కార్యక్రమంపై మిశ్రమ స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు దీన్ని మానవ సంబంధాలను అద్దెకు ఇచ్చే వ్యాపారం అని విమర్శిస్తుండగా.. మరికొందరు దీనిని ఒక సామాజిక సేవగా అభివర్ణిస్తున్నారు. కుటుంబం లేని వృద్ధులకు ఇది ఒక కొత్త జీవితాన్ని ఇస్తుందని, అనాథలుగా బతికే బదులు ఒక కుటుంబంలో ఆనందంగా ఉండవచ్చని ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తున్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో వెల్లడించేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa