చైనా మిలటరీ పరేడ్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా 26 దేశాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. వీరిలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి హాజరుకావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో కిమ్ వారసురాలు ఆమే అంటూ జరుగుతోన్న ప్రచారానికి బలం చేకూరినట్టయ్యింది. సోమవారం ప్యాంగ్‌యాంగ్ నుంచి తన రెండో కుమార్తె కిమ్ జ్యుయేతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణించి, మంగళవారం రాత్రి ఉత్తర కొరియా నియంత బీజింగ్‌కు చేరుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం చైనాకు లొంగిపోయి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా చైనా నిర్వహించిన సైనిక కవాతుకు హాజరయ్యారు.
అయితే, ఆమె గుర్తింపును అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ.. దక్షిణ కొరియా నిఘా వర్గాలు ఆమె కిమ్ రెండో కుమార్తె అని నమ్ముతాయి. అమెరికాకు చెందిన బాస్కెట్‌బాల్ దిగ్గజం డెన్నిస్ రాడ్‌మన్ 2013లో కిమ్ కుటుంబాన్ని కలిసినప్పుడు ఆ చిన్నారిని తన చేతులతో ఎత్తుకున్నానని చెప్పారు. దక్షిణ కొరియా నిఘా వర్గాలు ప్రస్తుతానికి జు యేను కిమ్ వారసురాలిగా భావిస్తోంది. కానీ, కిమ్ కుటుంబ రాజకీయాల్లో ఓ మహిళ ఎదగగలదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లినట్టు ఎటువంటి ఆధారాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కిమ్ జోంగ్ ఇల్ 1950లలో తన తండ్రి, ఉత్తర కొరియా వ్యవస్థాపక నాయకుడు కిమ్ ఇల్ సంగ్‌తో కలిసి విదేశాలకు వెళ్లాడని చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయని రాయిటర్స్ నివేదించింది.
ఎవరీ కిమ్ జు యేను ?
కిమ్ రెండో కుమార్తె కిమ్ జు యే తొలిసారి బయట ప్రపంచానికి 2022లో కనిపించారు. అప్పుడు ఆమె తన తండ్రితో కలిసి అత్యంత శక్తివంతమైన ఖండాతర్గత క్షిపణి ప్రయోగానికి హాజరయ్యారు. అప్పటి వరకు, కఠినమైన నియంత్రణ కలిగిన ఉత్తర కొరియా అధికారిక మీడియా కిమ్ జోంగ్ ఉన్ పిల్లల గురించి మౌనంగా ఉంది. ఇప్పటికీ కిమ్ ఇతర పిల్లల గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. దాదాపు 13 ఏళ్లు ఉంటుందని భావిస్తున్న జు యేను.. మే నెలలో రష్యా రాయబార కార్యాలయానికి వెళ్లి.. అక్కడ పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొంది. కిమ్ జోంగ్ ఉన్ ‘గౌరవనీయమైన కుమార్తె’గా గుర్తింపు పొందిన ఆమె పేరుతో పోస్టల్ స్టాంపులు, సీనియర్ అధికారులతో విందులలో కనిపించిందని బీబీసీ నివేదించింది.
ఉత్తర కొరియాలో ‘గౌరవనీయ’ అనే పదాన్ని అత్యున్నత స్థాయి అధికారులకు మాత్రమే ఉపయోగిస్తారు. ముఖ్యంగా, కిమ్ స్వయంగా ‘రెస్పెక్టెడ్ కామ్రెడ్’ అని పిలవడం వారసత్వ స్థానం బలంగా స్థిరపడిన తర్వాతే జరిగింది. దక్షిణ కొరియా జాతీయ గూఢచార సంస్థ (NIS) ఆమె గురించి అదనపు వివరాలను పార్లమెంట్ సభ్యులతో పంచుకుందని వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. ఆ సంస్థ నివేదిక ప్రకారం.. ఆమెకు గుర్రపు స్వారీ, స్కీయింగ్, ఈతలంటే ఇష్టం, అలాగే ఆమె రాజధాని ప్యాంగ్యాంగ్‌లో హోం-స్కూలింగ్ చదువుతోందని తెలిపింది.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. కొందరు విశ్లేషకులు కిమ్ భార్య రి సోల్ జూ సంప్రదాయంగా పోషించే పాత్రను జు యేను క్రమంగా స్వీకరిస్తోందని పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత కొరియా ద్వీపకల్పం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. అప్పటి నుంచి ఉత్తర కొరియా కిమ్ కుటుంబ పాలనలోనే ఉంది. కమ్యూనిస్టు ప్రపంచంలో ఏకైక వారసత్వ రాజవంశంగా ఇది నిలిచింది. ఈ పాలక వంశం పవిత్ర రక్తసంబంధం నుంచి వచ్చిందని కిమ్ కుటుంబం ప్రకటిస్తూ, దేశాన్ని పాలించేందుకు తామే అర్హులమని చెప్పుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa