ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు... తెరపైకి ప్రతిపాదనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 07:13 PM

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, ఇతరత్రా పనుల్లో వేగం పెరిగింది. ఈ క్రమంలోనే ఏపీలో కొత్తగా మరో ఓఆర్ఆర్ మీద చర్చ జరుగుతోంది. కర్నూలు నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు( ఓఆర్ఆర్) నిర్మాణం ప్రణాళికలు మరోసారి తెరపైకి వచ్చాయి. కర్నూలు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టు చేపట్టాలని భావించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కర్నూలు జిల్లా యంత్రాంగం ఓఆర్ఆర్ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలను ప్రారంభించింది.


కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో కర్నూలు ఓఆర్ఆర్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తర్వాత.. ఓఆర్ఆర్‌కు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని.. జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, కర్నూలు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పెద్దపాడును హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానించేలా ఓఆర్ఆర్ ప్రతిపాదన చేస్తున్నారు. కర్నూలు నగరానికి సంబంధించి ట్రాఫిక్ రద్దీ అనేది ఓ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా బళ్లారి రోడ్ జంక్షన్‌లో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటోంది. పెద్దపాడు నుంచి వచ్చే వాహనాలు, బెంగళూరు లేదా హైదరాబాద్ వైపు వెళ్లేందుకు జాతీయ రహదారిలోకి ప్రవేశించే వాహనాలు బళ్లారి చౌరస్తా గుండా వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఇక్కడే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ వస్తోంది.


ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు మంత్రి టీజీ భరత్.. గతంలో ఓ ప్రతిపాదన చేశారు. హైదరాబాద్ రోడ్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు చిన్న బైపాస్ ద్వారా లూప్ రోడ్డు వేయాలని ప్రణాళికలు రచించారు. అయితే దీంతో సమస్య పరిష్కారం కాదని భావిస్తున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి కర్నూలు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణమే పరిష్కారమనే సూచనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


గతంలో ఓఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి సంకల్ప్‌బాగ్, సాయిబాబా గుడి, రాఘవేంద్ర స్వామి మఠం మీదుగా రోజా దర్గా వరకు నిర్ణయించారు. రాంభొట్ల ఆలయం మీదుగా ఓల్డ్ సిటీ, జోహరాపురం, తుంగభద్ర నది వెంబడి ప్లాన్ చేశారు. అయితే ఈ దిశగా అడుగులు ముందుకు పడలేదు. అయితే కొత్త ఓఆర్ఆర్ రూట్ ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో నగరవాసులు కర్నూలు ఓఆర్ఆర్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa