భాద్రపద మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజు అంటే…. సెప్టెంబర్ 7వ తేదీన కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించనుంది. ఈ చంద్ర గ్రహణం రాత్రి 9:57 గంటలకి మొదలై…. సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:27 గంటల వరకు ఉంటుంది. ఇక గ్రహణ వ్యవధి 3.30 నిమిషాలు. అంటే.. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 11:32 గంటల సమయానికి మద్యకాలం, మోక్షకాలం ప్రారంభమవుతుంది. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటలకు (విడుపు) ముగుస్తుంది. మొత్తం ఆద్యంత పుణ్యకాలం మూడు గంటల 28 నిమిషాలు.( హైదరాబాదు)
ఇది చంద్రగ్రహణం కనుక రాత్రి ద్వితీ యామం లో ప్రారంభమవుతుంది , కనుక ముందు మూడు జాములు విడిచిపెట్టాలి . మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల లోపల నిత్య భోజన ఆబ్దిక కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. శక్తి లేనివాళ్లు వృద్ధులు పిల్లలు వ్యాధిగ్రస్తులు గర్భిణులు గ్రహణ ఆరంభ సమయానికి నాలుగున్నర గంటల ముందు అనగా ఒక యామము అందులో సగము సాయంకాలం4. 45 నిమిషాల ముందే ఆహారం తీసుకోవచ్చు. మంచి ఆరోగ్య శక్తి గల వారు రాత్రి గ్రహణ ముక్తి అనంతరము కూడా తీసుకోకపోవడం మంచిది. శక్తి లేనివారు ఆ సమయంలో ఆహారం తీసుకోవచ్చు గానీ అప్పటికప్పుడు వండుకొని తీస్కొనటం మంచిది. ఎందుకు అంటే గ్రహణానికి ముందు వండిన పదార్థాలు పనికిరావు కనుక, ఊరగాయలు పాలు నెయ్యి మొదలైన పదార్థాలు దర్భ లతో కప్పి ఉంచాలి. ఎందుకంటే దర్భలను ఆ కాంతి కిరణాలను నిరోధించే శక్తి కలవిగా గుర్తించారు ఆచారంలో ఎలా వచ్చిందంటే ఒక దర్భ పుల్లని అందులో, (అంటే ఊరగాయల మీద పాలు మొదలైన వాటి మీద) వేయడం. కానీ అలా వేసినప్పుడే కాంతి కిరణాలను ఎలా నిరోధిస్తాయి. అందుకని దర్భలతో కప్పి ఉంచడం మంచిది. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ మీద కూడా దర్భ లతో కప్పి ఉంచటం మంచిది. ఎందుకంటే మామూలుగా గ్రహణ సమయంలో నీళ్లన్నీ పారబోసి నీళ్లు పట్టుకోవాలి. ఇంట్లో బోరింగ్ ఉన్నట్లయితే అప్పుడు బోరింగ్ వేసి నీళ్లు పట్టుకోవచ్చు. నుయ్యి ఉంటే దాంట్లో నుంచి తీసుకోవచ్చు. దగ్గర్లో చెరువులు ఉంటే ఇది వరకు చెరువు నుంచి తీసుకొచ్చుకునేవారు. నదిఉంటే అందులోంచి తెచ్చుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉన్న నీళ్లే వాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నందున ఓవర్ హెడ్ ట్యాంక్ మీద దర్భలు వేసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో మనకు అంతకుముందు ఉపదేశం ఉన్న మంత్రాలూ శ్లోకాలు చేసుకోవడం మంచిది. లేక అవి ఆశోచం పొందుతాయి. తర్వాత మనం ఉపదేశం పొందిన మంత్రాలు చేసుకున్న ఉపయోగపడవు. గ్రహణం విడిచిపెట్టడం మొదలుపెట్టిన తర్వాత రాత్రి 11 గంటల 30 నిమిషాల తర్వాత దానాలు చేయాలి. ఏం దానాలు చేయాలి సూర్యబింబం, నాగబింబం బంగారంలోను, చంద్రబింబం వెండి లోను చేసి దానికి కొంచెం నువ్వులు, ఆవు నెయ్యి కంచు పాత్ర , బియ్యం, వస్త్రం, దక్షిణ వీటన్నిటిని కలిపి దానం చేయాలి.
ఎవరు దానం చేయాలి అంటే?
పూర్వాభాద్ర పునర్వసు విశాఖ నక్షత్రములవారు అలాగే కర్కాటక వృశ్చిక కుంభ మీన రాశుల వారు...ఈ దానాలు చేయాలి
మేష, వృషభ కన్య ధనస్సు రాశుల వారికి ఉత్తమ ఫలితాలు కనుక ఇబ్బంది లేదు
మిధున సింహ తుల మకర రాశుల వారికి మధ్యమ ఫలితాలు కనుక ఇబ్బంది లేదు.కానీ గ్రహణ సమయంలో అంటే గ్రహణం పట్టిన వెంటనే స్నానం, ఆ తరువాత జపాలు తర్పణాలు, గ్రహణం విడిచిపెట్టడం ప్రారంభించిన వెంటనే దానాలు ఎంత చేసుకుంటే అంత మంచిది.
ఎందుకంటే ఆ సమయంలో చేసే దానాలు కోటి గుణితమైన ఫలితాలు ఇస్తాయి కనుక. ఆ సమయంలో ఎవరూ దొరకలేదు అనుకుంటే ఆ సమయంలో ఏ ఏ దానాలు చేయాలి అనుకుంటున్నామో ఆ దానాలు భగవంతునికి సమర్పించి దక్షిణ తో సహా మరునాడు ఇంటి పురోహితుడు లేక దేవాలయ పూజారికి ఇవ్వడము మంచిదిఇక గ్రహణ సమయంలో కూడా మడి వస్త్రాలు ధరించాలి జపము చేసుకొనుటకు
మడి వస్త్రాలు ఎలా ధరించాలి అంటే? గ్రహణానికి ముందే ఆ వస్త్రానికి గర్భముడివేసి ఆర వేసి, స్నానం చేశాక ఆ పొడి బట్టలు ధరించి చేయాలి.
గ్రహణము ప్రారంభమైన వెంటనే సచేలా స్నానం చేయాలి.
అలాగే తర్పణాలకు కావలసిన తిలలు, దర్భలు, పుస్తకాలు అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే అవన్నీ ముట్టుకోకూడదు. ఈ సమయం వృధా కాకుండా గాయత్రి మంత్రం మొదలైనవి ఉన్నవారు జపాలు చేసుకోవాలి
మంత్రోపదేశము పొందడానికి కూడా ఈ సమయం అతి విశిష్టమైనది
గ్రహణము తర్వాత స్నానము చేసేంతవరకు ఈ జపం మొదలైన చేసుకోవడానికి అవసరమైన సామాను తప్ప మిగిలిన బట్టలు మొదలైనవి ముట్టుకోకూడదు. అలా చేసినట్లయితే దాని గ్రహణ సూతమంటారు
ఆశోచం లో ఉన్నవాళ్లు కూడా గ్రహణ సమయంలో స్నానం చేసి ఉపదేశములో ఉండే మంత్రాలు చేసుకోవచ్చు. ఆ మేరకు మాత్రమే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మిగిలిన వాళ్ళని ముట్టుకోకూడదు.
గ్రహణ కాలంలో నిద్రపోవడం కూడదు, తండ్రి లేని వాళ్ళు పితృతర్పణాలు, తిల తర్పణాలు తప్పనిసరిగా ఇవ్వాలి. దానాలు చేయాలి అష్టదిక్పాలకులకు గ్రహణ దోష నివారణకు ప్రార్థనా శ్లోకాలు పటించాలి.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భంలో ఉండే శిశు రక్షణ కొరకుచక్కగాస్తోత్రాలు చేసుకోవచ్చు
విడిచిన తర్వాత మోక్ష స్నానం చేయాలి. లేనట్లయితే మరల గ్రహణం వచ్చేవరకు ఆసౌచం ఉంటుంది.
గ్రహణ ప్రారంభంలో సంకల్పం చేసి స్నానం చేయాలి.
గ్రహణ సమయంలో తర్పణాలు జపాలు చేయాలి
గ్రహణం విడవడం ప్రారంభించాక దానాలు చేయాలి
గ్రహణం పూర్తి అయిన తర్వాత శుద్ధి స్నానం చేయాలి
సంకల్పం చెప్పుకునేటప్పుడు తమకు అభ్యాసంలో ఉండే విధానమును అవలంబించడం మంచిది.
గ్రహణనక్షత్రాలు అధమ ఫలితాలు ఇచ్చే రాశుల వారు వెండితో చంద్రబింబాన్ని బంగారంతో సూర్య నాగభింబాలని తయారుచేసి దానికి కొంచెం నువ్వులు, ఆవు నెయ్యి కంచు పాత్ర , బియ్యం, వస్త్రం, దక్షిణ వీటన్నిటిని కలిపి గ్రహణ మధ్య కాలానంతరము నందు “మమజన్మరాశి, జన్మనక్షత్ర,చతుర్ధాద్యరిష్టస్థాన స్థితగ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక, ఏకాదశస్థానస్థిత గ్రహణ
సూచిత శుభ ఫలప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే” అని సంకల్పంతో దానం చేయాలి.
“ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయాం” అని ఖ్యాతి పొందిన మహోన్నత పండితులు వరాహమిహిరులు. వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రములోనూ, జ్యోతిషములోనూ ఉద్దండ పండితుడు. స్కంద్రత్రయ జ్యోతిష విభాగముల్లోనూ విస్తారముగా రచనలు చేసారు. అవన్నీ చాలా పెద్దపెద్ద గ్రంధాలు కావడములో,అంత పెద్ద వాటిని అవలోక నం చేయలేని ఆశక్తుల కోసం వాటిని లఘు గ్రంధాలు కూడా తానే స్వయంగా విరచించాడు.
వరాహమిహిరులు అన్ని గ్రంధాలలో చాలా ప్రసిద్ధిగాంచిన గ్రంధం “బృహత్సంహిత” . దీనికి భట్టోత్పలుని వ్యాఖ్యానం చాలా ప్రసిద్ది చెందింది. బృహత్సంహిత అనేది పురాతన భారతీయ జ్యోతిష్య గ్రంథం. వరాహ మిహిరుడిచేత రచించబడినది. ఇందులో ఖగోళ జ్యోతిష్య భూగోళ వాతావరణ శాస్త్రాలతో పాటు అనేక అంశాలు కలిగి ఉంది. గ్రహాలు నక్షత్రాల స్థానాలు ప్రభావాలు వాటి ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం అనే దాని గురించి వివరిస్తుంది.
శ్రీ వరాహమిహిరాచార్య కృత బృహత్సంహిత పంచమాధ్యాయము రాహుచారము లో(1,2 శ్లో)
శ్లో: అమృతాస్వాదవిశేషాచ్చిన్నమపి శిరః కిలాసురస్యేదమ్
ప్రాణైరపరిత్యక్తం గ్రహతాం యాతం వదన్యేకే
తా|| కొంతమందిపండితుల అభిప్రాయప్రకారము రాహువు అను నామము గల అసురుడు తలఖండింప బడియూ అమృతపాన విశేషమువలన ప్రాణములను వీడక రాహు గ్రహ రూపమునొందెనని తెలుపుదురు.(బృహత్ సంహిత)
శ్లో: ఇందర్కమండలాకృతి రసితత్వాత్ కిల నధృశ్యతే గగనే
అన్యత్ర పర్వకాలా ద్వరప్రదానాత్ కమలయోనేః
తా: చంద్రరవుల ఆకృతిగల ఈరాహువు నలుపురంగునుగలిగియుండి (నల్లనిచాయ) బ్రహ్మయొక్కవరముచేతను గ్రహణసమయములందున రవి చంద్రులను మర్దించుచూ గోచరించును. ఇతరసమయములందున కనిపించడు.
వివరణ: పూర్వము దేవదానవులు పాలసముద్రమునుతరచుచుండగా అందు అనేక వస్తువులు ఉద్భవించిన పిదప అమృతముకూడా ఉద్భవించినది, అమృతము కొరకై దేవదానవులు యుద్దమునకు సిద్దపడగా శ్రీమహావిష్ణువు
మోహినీ రూపమును ధరించి రాక్షసులకు అమృతము నీయకుండా దేవతలకు మాత్రమే అమృతము పోయుచుండెను. అదిగమనించిన రాహువును రాక్షసుడు దేవతలపంక్తిలో దేవతా రూపమును ధరించి కూర్చుండెను, దానిని గమనింపక మోహినీ రూపుడగు శ్రీవిష్ణువు వానికి కూడా అమృతమును పోయుచుండగా రవి చంద్రులు మోహినీ రూపుడగు హరికి అతను రాక్షసుడని సైగచేసిరి వెనువెంటనే శ్రీమహావిష్ణువు తన చక్రాయుధముచే ఆరాక్షసుని కంఠమును ఖండించెను గానీ అప్పటికే అమృతమును గ్రోలిన ఆరాక్షసుని శిరము ఖండించబడిననూ అమృతపాన ప్రభావముచే మరణించక శిరస్సు మెండెము వేర్వేరుగా జీవించియుండుట చూసి బ్రహ్మరాక్షసుని శిరోభాగము రాహువుగను కబందమును కేతువుగను గ్రహములగుదురని వరమొసంగెను, పూర్వవైరమును(అమృతపానమును విష్ణువునకు తెలిపినందున) సాధించుటకై అమావాస్య పౌర్ణమి సమయములలో రవిచంద్ర బింబములను పీడింతురు. దానినే మనము గ్రహణ రూపమున చూచుచున్నాము, ఆ సమయములందున మాత్రమే రాహుకే తువుల దర్శన మగును తక్కిన సమయములందున కనిపించు గ్రహములుగావు.
బృహత్ సంహిత పంచమాధ్యాయము రాహుచారములో,14, 15 శ్లోకాల్లో
శ్లో: యోషావసురో రాహు స్తస్యవరో బ్రహ్మణాయమాజ్ఞాప్తః
ఆప్యాయముపరాగే దత్తహుతాంశేన తేభవతి (బృహత్ సంహిత)
శ్లో: తస్మిన్ కాలే సాన్నిధ్యమస్య తేనోపచార్యతే రాహుః
యామ్యోత్తరా శశిర్గతిర్గణిర్గేప్యుపచర్యతేతేన
తా॥ రాహువు అనుపేరుగల అసురునకు బ్రహ్మలోకమున జనులుగ్రహణ యుందును సమయమున నీకై ఉద్దేశించిహోమాదులనుచేయుదురని వరమునిచ్చెను.ఆహోమములతో నీవు తృప్తిచెందుమని వచించెను. అందువలన గ్రహణకాలమున హోమ దానాదులు జరుగుచుండును. అందుచేతనే గణితమువలన చంద్రుని గతి దక్షిణ ఉత్తరము లకు చలించుచుండును
శ్లో: కళింగవంగాన్ మగధాన్ సురాష్ట్రాన్
మ్లేచ్చాన్ సువీరాన్ దరదాంశకాంశ్చ
స్త్రీణాంచ గర్భానసురో నిహంతి
సుభిక్షకృధ్ భాద్రపదేభ్యుపేత (బృహత్ సంహిత, రాహుచారం, శ్లో 79)
తా॥ భాద్రపదమాసమున గ్రహణము సంభవించినచో కళింగ (ఒరిస్సా) వంగ(బెంగాల్) మగధ, సౌరాష్ట్ర (సూరత్) మ్లేచ్చ, సువీర, దరద, అశ్మక, దేశములకు ఇబ్బందులు గలుగును, స్త్రీలకు ఇబ్బంది గలుగును. లోకమునకు సుభిక్షముగలుగును.
(భాద్రపద మాసంలో గ్రహణం ఏర్పడితే కలిగే ఫలితాలను ఈ శ్లోకం వివరిస్తుంది. ముఖ్యంగా ప్రభావాలను సంభవించినప్పుడు కలిగే వివిధ పరిణామాలను ప్రజల జీవితాల పై దాని ప్రభావాన్ని తెలియ చేస్తోంది. వివిధ ప్రాంతాలలో ప్రజలకు కష్టాలు కలుగుతాయి అయినప్పటికీ లోకానికి సుభిక్షంగా కూడా ఉంటుంది.)
శ్లో: పాంశువిలోహితరూపః క్షత్రధ్వంసాయ భవతివృష్టేచ
బాలరవి కమల సురచాపరూప భృశ్చస్త్రకోపాయ(బృహత్సంహిత శ్లో 59)
తా॥ ధూళిరంగు, రక్తవర్ణమునుగలగిన గ్రహణమువలన క్షత్రియులకు, వర్షములకు అవరోధమునుగలిగించును, ఉదయకాలపు సూర్యునిబోలిన పిలవర్ణము రంగు(అరుణవర్ణము) లేక కమలము ఇంద్రధనస్సులను బోలిన రంగును గలగియున్నచో శస్త్రముల వలన భయము జననాశముగలుగును. (ఈ శ్లోకం వివిధ రంగుల గ్రహణాల గురించి దాని ప్రభావాలు గురించి వివరిస్తుంది.)
శ్లో: గ్రహణ శాంతి శ్లోకము
ఇంద్రోనలో దండధరశ్చ రక్షః ప్రాచేతసో
వాయు కుబేర శర్వాః !
మజ్జన్మ ఋక్షే మమ రాశి సంస్థే
చంద్రోపరాగం శమయంతు సర్వే !!
గ్రహణ సమయంలో ఈ శ్లోకాన్ని రాసుకొని నుదురున కట్టుకొన వలెను.
ఆ తదుపరి పఠించవలసిన మంత్రాలు
శ్లో: గ్రహణ పరిహార శ్లోకము
యో౬సౌ వజ్రధరో దేవః ఆదిత్యానాం ప్రభు ర్మతః |
సహస్రనయన శ్శక్రః గ్రహపీడాం వ్యపోహతు || 1
ముఖం య స్సర్వ దేవానాం సప్తార్చి రమిత ద్యుతిః |
చన్ద్ర సూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు || 2
యః కర్మసాక్షీ లోకానాం యమో మహిషవాహనః |
చన్ద్ర సూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు || 3
రక్షో గణాధిప స్సాక్షాత్ ప్రలయానల సన్నిభః |
ఉగ్రః కరాళో నిరతిః గ్రహ పీడాం వ్యపోహతు || 4
నాగపాశధరో దేవో నిత్యం మకరవాహనః |
వరుణో జలలోకేశః గ్రహ పీడాం వ్యపోహతు || 5
ప్రాణరూపో హి లోకానాం వాయుః కృష్ణమృగప్రియః |
చన్ద్ర సూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు || 6
యో౬సౌ నిధిపతి ర్దేవః ఖడ్గశూల ధరో వరః |
చన్ద్ర సూర్యోపరాగోత్థాం కలుషం మే వ్యపోహతు || 7
యో౬సౌ శూలధరో రుద్రః శంకరో వృషవాహనః |
చన్ద్ర సూర్యోపరాగోత్థాం దోషం నాశయతు ద్రుతమ్
గ్రహణ పరిహార శ్లోకము చంద్రుడు మరియు సూర్యుని యొక్క గ్రహణాల సమయంలో కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి పఠిస్తారు. గ్రహణాల సమయంలో ఈ శ్లోకాలను పఠించడం వల్ల ఏర్పడే దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు, ఇది మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ప్రగతిని పెంచుతుందని భావిస్తారు.ఈ శ్లోకములు గ్రహణ సమయంలో పఠించేందుకు ఉద్దేశించబడ్డాయి, వివిధ దేవతలను ప్రార్థించడం ద్వారా గ్రహణాల ప్రతికూల ప్రభావాలను తగ్గించాలని దీని లక్ష్యం. ఈ శ్లోకాలు దేవతలను స్తుతించడమే కాకుండా, గ్రహణం యొక్క ప్రతికూలతలను తగ్గించడంలో సహాయపడతాయి.ఈ శ్లోకాల్లో వివిధ దేవతల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు, వజ్రధరుడు (ఇంద్రుడు), యముడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, రుద్రుడు వంటి దేవతలను ప్రార్థించారు. ప్రతి దేవతను ఒక ప్రత్యేక లక్షణం లేదా శక్తికి సూచిస్తారు, గ్రహణ సమయంలో వారి అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తారు.
ఈ చంద్ర గ్రహణం ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవిస్తుంది కాబట్టి సూత కాలం పాటించాలి. ఈ చంద్ర గ్రహణ సమయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండటం, మంత్రాలు జపించడం, దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.ఒకవేళ దానాదికార్యములు చేయలేని స్థితిలో ఉన్న వారికి గ్రహణా నంతరము మరునాడు శివాలయ దర్శనం, రుద్రాభిషేకలు చేసుకోలేకున్నా చూడటం, శంకరుని ముఖ్యంగా అరుణాచల శివ అయినను జపించడం మేలు.
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com
www.padmamukhi.com
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa