ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఆర్ పాటిల్ పోటీ చేసిన తొలి ఎన్నిక నుంచి గత నాలుగు విడతలుగా ఘనవిజయాలు సాధిస్తూ, అంతకంతకు మెజారిటీ పెంచుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయడంపై మంత్రి లోకేశ్ అభినందించారు. ఇంతలా ప్రజల అభిమానాన్ని చూరగొనడం వెనుక విజయ రహస్యం ఏమిటని వాకబు చేశారు. ఈ సందర్భంగా పాటిల్ బదులిచ్చారు. అనునిత్యం ప్రజలతో మమేకం అవుతూ.. వారితోనే ఉండటమే తన విజయ రహస్యమని చెప్పారు. "పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాల అమలుతోపాటు నవసారీని దేశంలోనే మొదటి స్మోక్‌లెస్ జిల్లాగా తీర్చిదిద్దాం. సూరత్ నగర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాం. వస్త్ర–వజ్ర పరిశ్రమలకు విధానాలు, మౌలిక వసతులు, సూరత్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేశాం. నవసారీ పరిధిలోని చిఖ్లీ గ్రామ పంచాయతీని సన్స్‌ద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద అభివృద్ధి చేయగా, అది దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. రెండో దశ కొవిడ్ సమయంలో, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల ద్వారా కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించి సేవలందించాం" అని పాటిల్ వివరించారు. గుజరాత్ లోని నవసారి లోక్ సభ నియోజకవర్గం ఎంపీగా 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు సీఆర్ పాటిల్ ఎన్నికయ్యారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో నవసారి నుంచి పోటీ చేసిన సీఆర్ పాటిల్ 1,32,643 ఓట్లతో నెగ్గారు. 2014లో 5,58,116 ఓట్ల మెజారిటీతో దేశంలో 3వ స్థానం, 2019లో 6,88,668 ఓట్ల మెజారిటీతో దేశంలో అగ్రస్థానం, 2024 ఎన్నికల్లో 7,73,551 ఓట్ల భారీ మెజారిటీతో దేశంలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఇక, ఈ భేటీలో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌లో గత 15 నెలలుగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా లోకేశ్ కేంద్రమంత్రికి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa