ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడి వరకూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. పది రోజుల్లోనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 07:38 PM

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. సుదూర ప్రాంతాలను వేగంగా చేరుకునేలా ఈ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ రైళ్లల్లో ఆక్యుపెన్సీ కూడా ఎక్కువగా ఉండటంతో కొత్త రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే విజయవాడ - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించి గత కొంతకాలంగా ఓ డిమాండ్ వినిపిస్తోంది. చెన్నై – విజయవాడ వందే భారత్ రైలు సర్వీసును భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని స్థానికులు కోరుతున్నారు. దీని ద్వారా విద్యార్థులు, ఉద్యోగులకు రవాణా సదుపాయాలు మెరుగవుతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ విషయమై రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సీఎం రమేష్‌‍కు లేఖ రాశారు.


అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేష్.. రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నరసాపురం వరకూ పొడిగించాలని కోరుతూ రఘురామ, సీఎం రమేష్‌కు లేఖ రాశారు. ఈ సర్వీసు పొడిగించడం వలన నరసాపురం, భీమవరం పరిసర ప్రాంతాలకు వేగవంతమైన రవాణా అందుతుందని.. అలాగే విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు ఉపయోగపడుతుందని అందులో పేర్కొన్నారు. రైలు ఆక్యుపెన్సీ కూడా పెరిగే అవకాశం ఉందని లేఖలో వివరించారు. ఈ అభ్యర్ధనను మరో 10 రోజులలో క్లియర్ చేస్తామని సీఎం రమేష్ మాట ఇచ్చారంటూ రఘురామకృష్ణరాజు ట్వీట్ చేశారు.


మరోవైపు విజయవాడ - చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 517 కి.మీ దూరాన్ని కేవలం 6 గంటల 40 నిమిషాల్లోనే చేరుకుంటుంది. ఈ రైలు మంగళవారం మినహా వారంలో మిగతా అన్ని రోజులూ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ చెన్నైలో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరితే.. మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. రేణిగుంట, నెల్లూరు , ఒంగోలు, తెనాలి స్టేషన్లలో ఆగుతుంది. చెన్నై - విజయవాడ వందేభారత్ రైలులో ఛైర్‌కార్‌ టికెట్ ధర రూ.1320గా ఉంది.


అలాగే ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ రూ.2540గా ఉంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు బయల్దేరితే.. రాత్రి 10 గంటలకు చెన్నై రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. అయితే ఈ రైలును విజయవాడ వరకూ మాత్రమే కాకుండా నరసాపురం వరకూ పొడిగించాలని ఈ ప్రాంతవాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు గత కొంతకాలంగా కోరుతున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa