యూట్యూబర్ సప్నాగిల్‌తో వివాదం కేసులో టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు కోర్టు ఫైన్ విధించింది. సప్నా గిల్ వేసిన పిటిషన్‌కు సమాధానం దాఖలు చేయడంలో విఫలమైనందున రూ.100 జరిమానా చెల్లించాలని పృథ్వీ షాను కోర్టు ఆదేశించింది.
వివాదం ఎలా మొదలైందంటే?
ఈ వివాదం ఫిబ్రవరి 2023లో ముంబైలోని అంధేరిలో ఉన్న ఒక పబ్ బయట మొదలైంది. ఒక సెల్ఫీ తీసుకోవడం విషయంలో పృథ్వీ షా, సప్నా గిల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటన తర్వాత సప్నా గిల్, పృథ్వీ షా తనను వేధించారని ఫిర్యాదు చేసింది. మొదట పోలీసులు సప్నా గిల్‌ను ఈ దాడి కేసులో అరెస్ట్ చేశారు. అయితే గిల్ ఫిర్యాదును పోలీసులు నమోదు చేయకపోవడంతో ఆమె నేరుగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది.
సప్నా గిల్ పిటిషన్ లో ఏముంది?
బెయిల్ పొందిన తర్వాత సప్నా గిల్ తన లాయర్ ద్వారా పృథ్వీ షా, అతని స్నేహితుడు ఆశిష్ యాదవ్, ఇతరులపై వేధింపుల ఫిర్యాదు చేసింది. ఆమె తన పిటిషన్‌లో భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని కీలక సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరింది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 354 (వేధింపులు), 509 (మహిళల గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో మాట్లాడటం లేదా సంజ్ఞలు చేయడం), 324 (ప్రమాదకరమైన ఆయుధాలు లేదా సాధనాలతో ఉద్దేశపూర్వకంగా గాయపరచడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరింది. పృథ్వీ షా, అతని స్నేహితుడు బ్యాట్‌తో దాడి చేశారని ఆమె ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగానే.. కోర్టు నోటీసులకు స్పందించిన పృథ్వీ షాపై ఈ జరిమానా విధించడం జరిగింది. న్యాయస్థానం దృష్టిలో ఈ జరిమానా చిన్నదే అయినా.. అది కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఓ హెచ్చరికగా భావించవచ్చు.