ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గృహనిర్బంధాలతో ప్రజా ఉద్యమాలని ఆపలేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 02:06 PM

ప్రజా ఉద్యమాలను గృహనిర్బంధాలతో ఆపలేర‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో, రైతుల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ పిలుపు మేరకు టెక్కలి లో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించేందుకు బయలుదేరిన మాజీ స్పీకర్‌, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం గృహనిర్బంధానికి పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. తన నివాసం నుండి బయలుదేరే ప్రయత్నంలోనే తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకోవడంతో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనంతరం ఆయన తన ఆవరణ వద్దే నిరసన కొనసాగించారు. అనుమతులు లేవన్న కారణంతో నిరసనలో పాల్గొననీయకపోవడం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ “ప్రజా ఉద్యమాలను గృహనిర్బంధాలతో ఆపలేరు. పాలన చేయలేని ప్రభుత్వం అధికారంలో ఉండటానికి అర్హతలేదు” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.రాష్ట్రంలో ఎరువుల కొరత రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఎరువు బ్లాక్ మార్కెట్లకు చేరిందని దాని కారణంగా రూ.260 ఉండే యూరియా ధర బహిరంగ మార్కెట్లో రూ.800కు చేరిందని, రైతులు తెల్లవారుజాము నుండి ఎరువుల షాపులు, రైతు భరోసా కేంద్రాల వద్ద క్యూల్లో నిలబడే పరిస్థితి దారుణమని తమ్మినేని అన్నారు. “నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో రైతులు ఇంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న దాఖలాలు లేవు” అని పేర్కొన్నారు.ఖరీఫ్ సీజన్‌లో పంటలకు అవసరమైన ఎరువులు సమయానికి అందించకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరతకు గల కారణాలను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్వేషించి, వెంటనే రైతులకు సరఫరా చేసే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రజల సమస్యలను ప్రజల ముందే ఎండగట్టడం ప్రతిపక్ష బాధ్యత అని, ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తే కూటమి ప్రభుత్వం ప్రజల కోపానికి గురికాక తప్పదని తమ్మినేని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్, డి సి సి బి మాజీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అల్లంశెట్టి ఉమ మహేశ్వరరావు, వాలంటీర్ వింగ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పైడి రానా ప్రతాప్, గురుగుబెల్లి ప్రభాకర్, మెట్ట కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa