ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంజినీర్, ర్యాపర్, ఇప్పుడు ప్రధాని? ఎవరీ బాలేన్ షా

international |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 09:08 PM

సోషల్ మీడియాపై నిషేధం ఏకంగా నేపాల్‌లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది. యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి, చివరకు ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్, ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీలు పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, యువత నిరసనల వెనుక కాఠ్మాండూ మేయర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయనే తదుపరి నేపాల్ ప్రధానిగా అయనే ఉండాలని ఆన్‌లైన్ క్యాంపెన్ ఊపందుకుంది. దీంతో యువత జనరల్ జెడ్ పేరుతో చేపట్టిన ఆందోళనలో ఆయనే కీలకంగా వ్యవహరించారనే అనుమానాలు బలపడుతున్నాయి.


గతవారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను నిషేధిస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యువత గళమెత్తింది. దీంతో పాటు నేపాల్‌ ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి కూడా తారాస్థాయికి చేరుకోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేపట్టిన ఆందోళనలు రక్తసిక్తంగా మారి 19 మంది ప్రాణాలు కోల్పోగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. ఒక్క రాజధాని కాఠ్మాండూలోనే 18 మంది మృతిచెందారు. వీరిలో చాలా మంది స్కూల్, కాలేజీ యూనిఫామ్స్‌లో ఉన్న విద్యార్థులే. ఇదిలా ఉండగా, ఈ ఆందోళనలకు సంఘీభావం ప్రకటించిన బాలెన్ షా.. తన వయసు కారణంగా ప్రత్యక్షంగా నిరసనల్లో పాల్గొనలేకపోతున్నానని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. జనరల్ జెడ్ ఆందోళనల్లో 28 ఏళ్లలోపు యువతే పాల్గొనాలని నిర్వాహకులు పరిమితి విధించారు.


నేపాల్ కొత్త ప్రధానిగా షా?


‘‘ఈ ర్యాలీ స్పష్టంగా జనరల్-జెడ్ ఆకస్మిక ఉద్యమం.. నేను కూడా వారికంటే వయసులో పెద్దవాడిని.... నేను వారి ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆలోచనలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను.. రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు, ప్రచారకులు ఈ ర్యాలీని తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవద్దు.. నేను భౌతికంగా హాజరు కానప్పటికీ నా పూర్తి మద్దతు యువతకు ఉంది’’ అని ఆయన అన్నారు. ఇక, సోషల్ మీడియాలో పలువురు బాలెన్ ప్రధాన పదవి చేపట్టాలని కోరుకుంటూ పోస్ట్‌లు పెడుతుండటం చెప్పుకోదగ్గ అంశం.


‘‘బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ మధ్య ఉన్న తేడా ఏమిటంటే, మన మధ్య వ్యక్తిగత ఆసక్తి లేకుండా దేశ మంచి కోసం మాత్రమే పనిచేసే వ్యక్తి ఉన్నారు. ఆయనే కాబోయే ప్రధాని బాలెన్’’ అని ఓ యూజర్ .. ‘మనం ఇక్కడితో ఆగలేం.., యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులతో సహా నేపాల్ జనరేషన్ జెడ్ 19 మంది భారీ మూల్యం చెల్లించారు... మనం ఫలితం చేరుకునే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బాలెన్ లాంటి నాయకుడు అవసరం. నేపాల్ భవిష్యత్తును నిశ్శబ్దం చేయలేం’ అని మరో నెటిజన్ పోస్ట్‌లు పెట్టారు.


ఎవరీ బాలెంద్ర షా?


బాలెన్‌గా గుర్తింపు పొందిన ఆయన అసలు పేరు బాలేంద్ర షా . ప్రస్తుతం కాఠ్మాండూ మేయర్‌గా ఉన్నారు. 1990లో జన్మించిన బాలెన్.. నేపాల్‌లో సివిల్ ఇంజినీరింగ్ అనంతరం భారత్‌లోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు నేపాల్ అండర్‌గ్రౌండ్ హిప్-హాప్ సన్నివేశంలో ర్యాపర్, గేయ రచయితగా చురుకుగా ఉండేవారు, తరచూ తన సంగీతం ద్వారా అవినీతి, అసమానత వంటి అంశాలను లేవనెత్తారు. తొలిసారి 2022 కాఠ్మాండూ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి.. 60వేలకుపైగా భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ‘బాలెన్ ఎఫెక్ట్’ పేరుతో పాపులర్ అయి.. యువతను ఆకట్టుకున్నారు. ఆయన భార్య సబీనా కఫ్లే కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే, గతేడాది ఫిబ్రవరిలో నేపాాల్‌లో అమెరికా రాయబారిని షా కలవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa