కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల సందర్భంగా భద్రతా నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తున్నారని, ఇది ఆయన భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు గురువారం ఒక లేఖ రాసింది. రాహుల్ గాంధీ భద్రత విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై ఇందులో స్పష్టమైన సూచనలు చేసింది.రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను సీఆర్పీఎఫ్ కల్పిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన ఈ భద్రతా వలయంలో ఉన్నప్పటికీ, ఆయన తన విదేశీ ప్రయాణాల వివరాలను భద్రతా సంస్థలకు ముందుగా తెలియజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు ఆరోపించాయి. ఇటీవల ఆయన ఇటలీ, వియత్నాం, దుబాయ్, ఖతార్, యూకే, మలేషియా వంటి దేశాల్లో వ్యక్తిగత, రాజకీయ పర్యటనలు చేశారు. ఈ పర్యటనలకు వెళ్లే ముందు ఆయన భద్రతా సిబ్బందికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. సీఆర్పీఎఫ్‌తో పాటు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కూడా ఈ విషయంపై రాహుల్ గాంధీకి నేరుగా ఒక లేఖ రాసి, దీనిని 'తీవ్రమైన అంశం'గా పరిగణించాలని సూచించింది.'యెల్లో బుక్' ప్రోటోకాల్ ప్రకారం, ఉన్నత స్థాయి భద్రత పొందే వ్యక్తులు తమ ప్రయాణ వివరాలను, ముఖ్యంగా విదేశీ పర్యటనల షెడ్యూల్‌ను అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ బృందానికి తప్పనిసరిగా అందించాలి. దీనివల్ల ఆయా దేశాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడానికి వీలుంటుంది. అయితే రాహుల్ గాంధీ ఈ నిబంధనను పదేపదే ఉల్లంఘిస్తున్నారని, ఇది ఆయన భద్రతా వ్యవస్థను బలహీనపరుస్తుందని సీఆర్పీఎఫ్ తన లేఖలో పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరింది.ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలోని కీలక నేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ భద్రత విషయంలో కేంద్ర బలగాలు నేరుగా పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లేఖలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa