వైసీపీది అబద్ధాలు, విద్వేషాలతో కూడిన దిగజారుడు రాజకీయమని, అబద్ధాలను ప్రచారం చేయడమే ఆ పార్టీ జెండాగా, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే జగన్ అజెండాగా పెట్టుకున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతుంటే, దానిపై వైసీపీ నాయకులు సోషల్ మీడియా, సాక్షి పత్రిక ద్వారా విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో పేర్ని నానిపైనా కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు. గతంలో తమ ప్రజా వ్యతిరేక విధానాలను న్యాయస్థానాలు ప్రశ్నిస్తే, న్యాయమూర్తులపైనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించిన చరిత్ర వైసీపీదని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను 'నారాసుర రక్త చరిత్ర' అంటూ చంద్రబాబుపై నెట్టాలని చూశారని, నిజాలు బయటపడటంతో ఇప్పుడు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్తపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. చివరికి సొంత చెల్లి గురించి కూడా దారుణమైన పోస్టులు పెట్టించినంత నీచమైన వ్యక్తులు బహుశా ఎవరూ ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతి గోశాలలో ఆవులు చనిపోయాయని, క్యూలైన్లలో భక్తులు ఆకలితో అలమటిస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేశారని, ఇతర రాష్ట్రాల వీడియోలు చూపి పులివెందుల, ఒంటిమిట్టలో రిగ్గింగ్ జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శించారు. గత ఏడాది విజయవాడ వరదల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు అయిన రూ. 23 లక్షల ఖర్చును రూ. 23 కోట్లుగా చిత్రీకరించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించిన అన్న క్యాంటీన్లపై కూడా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.వైసీపీ నేత పేర్ని నానిపై కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "పేర్ని నాని ఒక బఫూన్‌లా తయారయ్యారు. ఆయన నటనకు ఆస్కార్, భాస్కర్ అవార్డులు ఇవ్వొచ్చు" అని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి నరుక్కుంటూ వస్తామని బెదిరించడం, చీకట్లో నరికేయమని రెచ్చగొట్టడం వైసీపీ నేతల సంస్కృతి అని అన్నారు. ఇటీవల ఒక ధర్నాలో వ్యక్తికి మద్యం తాగించి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను తిట్టించడాన్ని పేర్ని నాని సమర్థించడం సిగ్గుచేటని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని జగన్, పేర్ని నాని చూస్తున్నారని, గతంలో మచిలీపట్నంలో రజకుల ఇళ్లను కూల్చినప్పుడు పేర్ని నానికి వారిపై ప్రేమ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.పేర్ని నాని అవినీతిపై కొల్లు రవీంద్ర పలు ఆరోపణలు చేశారు. మచిలీపట్నంలోని రంగనాయక దేవాలయానికి చెందిన భూములను తన అనుచరులతో వేలంలో కొనిపించి, 2022లో వాటిని తన భార్య, మామ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. అధికారంలో ఉండగా 8,000 బస్తాల రేషన్ బియ్యాన్ని గోడౌన్ల నుంచి అక్రమంగా తరలించిన దొంగతనం కూడా బయటపడిందని తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారు శ్రీరంగ నీతులు చెబుతున్నారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి వైద్య విద్యను ప్రోత్సహిస్తుంటే, దానిపైనా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని, రాష్ట్ర ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగిందని తెలిపారు. అసెంబ్లీలో చర్చకు రాకుండా, సోషల్ మీడియాలో అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టే వైసీపీ కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa