ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముందు పొగుడుతూ.. వెనక గోతులు తీస్తూ..అమెరికా సరికొత్త వ్యూహం

international |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 09:33 PM

భారత్‌పై ఎన్ని సుంకాలు విధించిన అమెరికాకు తలొగ్గడం లేదు. అనేక రకాలుగా బెదిరింపులకు గురిచేసినా ఏమాత్రం జంకడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన బృందమంతా భారత్‌ను భయపెట్టాలని చూసినా బెదరడం లేదు. సుంకాలు విధించి భారత్‌ను చెప్పు చేతుల్లోకి తెచ్చుకుందామని చూస్తే.. చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుని అమెరికా తలబొప్పి కట్టే చర్యలు తీసుకుంటోంది. భారత్‌ మాట వినడం లేదని ఒకవైపు, భారత్‌లా మరిన్ని దేశాలు కూడా అదే శైలిలో అమెరికాతో వ్యవహరిస్తే పెద్దన్న పాత్ర నుండి దిగిపోవాల్సి వస్తుందేమో అనేది మరోవైపు.. ఇలా భారత్ సైలెంట్‌గా ఉంటూనే అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. దీంతో భారత్‌పై అమెరికా సరికొత్త వ్యూహానికి తెరతీసినట్లు కనిపిస్తోంది.


కత్తి చూపితే భారత్ బెదరడం లేదని తెలుసుకున్న అమెరికా, ఇప్పుడు అదే కత్తికి తేనె పూసి భారత్‌ను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు భారత్‌పై విమర్శలు, బెదిరింపులకు దిగుతూ.. అదే సమయంలో పొగడ్తలు, ప్రశంసలతో ముంచెత్తుతోంది. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ట్రంప్ శుభాకాంక్షలు చెబుతూ వాడిన భాషను అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని మోదీని 'గొప్ప స్నేహితుడు', 'అద్భుతమైన నాయకుడు' అంటూ ప్రశంసలతో ముంచెత్తారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ పొగడ్తల వెనక భారత్‌పై తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లు పెంచే యోచన చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


 ప్రధాని మోదీని వ్యక్తిగతంగా ప్రశంసిస్తూనే, మోదీ ప్రభుత్వంపై ఆర్థికంగా అమెరికా ఒత్తిడి పెంచుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తన వ్యాపార నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. ఇనుప పిడికిలికి వెల్వెట్ గ్లోవ్స్ తొడిగినట్లు అనే విధానాన్ని అనుసరిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా ఇంధనంపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడం, తమకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందాలను సాధించడం వంటి లక్ష్యాలను నెరవేర్చుకోవడమే ఈ వ్యూహం వెనక ఉన్న ఉద్దేశమని పేర్కొంటున్నారు. ఈ ద్వంద్వ వైఖరి భవిష్యత్తులో భారత్-అమెరికా సంబంధాలను మరింత సంక్లిష్టం చేయనుందని చెబుతున్నారు.


అమెరికా ఇటీవల భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలతో రొయ్యలు, వస్త్రాలు, తోలు, పాదరక్షల వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే భారత్ ఇతర మార్కెట్ల కోసం అన్వేషిస్తోంది. అదే సమయంలో స్వదేశంలో మార్కెట్ పెంచే చర్యలు కూడా చేపడుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, అమెరికా వాణిజ్య ప్రతినిధులు ఇటీవలే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలను తిరిగి ప్రారంభించారు. అంతకుముందు, ఆగస్టు 25న జరగాల్సిన ఆరో రౌండ్ చర్చలు.. సుంకాల విధింపు కారణంగా రద్దయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa