మహమ్మద్ ప్రవక్త బోధనలను పాఠశాల సిలబస్‌లో చేర్చాలని ఎస్‌డిపిఐ నేత నెల్లై ముబారక్ చేసిన డిమాండ్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్పందించారు. ప్రవక్తకు సంబంధించిన బోధనలు ఇప్పటికే రాష్ట్ర విద్యా సిలబస్‌లో భాగంగా ఉన్నాయని ఆయన ఆదివారం ప్రకటించారు. “ఎస్‌డీపీఐ నాయకుడు నెల్లై ముబారక్.. మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన అంశాలను సిలబస్‌లో చేర్చమని కోరారు. ఇదివరకే ఆ బోధనలు పాఠ్యాంశాల్లో చేర్చడం సంతోషంగా ఉంది” అని సీఎం స్టాలిన్ అన్నారు.
మహమ్మద్ ప్రవక్త బోధించిన సమానత్వం, ప్రేమ అనే సూత్రాలను స్టాలిన్ ప్రశంసించారు. ఆ సూత్రాలు పెరియార్ ఇ.వి. రామసామి, డీఎంకే దిగ్గజాలైన సి.ఎన్. అన్నాదురై, ఎం. కరుణానిధిల భావజాలంతో సరిపోలుతాయని తెలిపారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో.. ముస్లింల హక్కులను పరిరక్షించడంలో డీఎంకే నిబద్ధతను స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీలైన ఏఐఏడీఎంకే, బీజేపీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణలను స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. డీఎంకే చేసిన చట్టపరమైన పోరాటాల కారణంగానే సుప్రీం కోర్టు ఆ చట్టంలోని కీలక నిబంధనలపై స్టే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ట్రిపుల్ తలాక్ వంటి ముస్లింలకు సంబంధించిన సమస్యలపై ఏఐఏడీఎంకే ద్రోహం చేసిందని స్టాలిన్ ఆరోపించారు. ఈ సమస్యలపై నిరసనగా ఏఐఏడీఎంకే నేత అన్వర్ రాజా డీఎంకేలో చేరడాన్ని ఆయన ప్రస్తావించారు. “సీఏఏ వల్ల ఎవరైనా ప్రభావితమయ్యారా అని ఎవరు అడిగారో, సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ముస్లింలపై ఎవరు లాఠీచార్జి చేయించారో మీకు బాగా తెలుసు” అని ఏఐఏడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిని పేరు చెప్పకుండా స్టాలిన్ ఎద్దేవా చేశారు.
ముస్లింల సంక్షేమానికి డీఎంకే కృషి
ముస్లింల హక్కులకు డీఎంకే చారిత్రక మద్దతును స్టాలిన్ గుర్తు చేసుకున్నారు. 1969లో కరుణానిధి మిలాద్-ఉన్-నబీ సెలవు దినాన్ని ప్రకటించారని, 2001లో ఏఐఏడీఎంకే పాలనలో దానిని రద్దు చేశారని గుర్తు చేశారు. అయితే 2006లో తిరిగి డీఎంకే దానిని పునరుద్ధరించిందని వివరించారు. తన ప్రభుత్వం ముస్లింల కోసం చేపట్టిన సంక్షేమ చర్యలను కూడా ఆయన ప్రస్తావించారు. ఉర్దూ మాట్లాడే ముస్లింలకు వెనుకబడిన తరగతి వర్గంలో 3.5 శాతం అంతర్గత రిజర్వేషన్లు, మైనారిటీ సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఉర్దూ అకాడమీ స్థాపన, చెన్నై విమానాశ్రయం సమీపంలో కొత్త హజ్ హౌస్ నిర్మాణం కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.
అలాగే మహమ్మద్ ప్రవక్త 1,500వ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, కరుణానిధి వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. వారు తిరువారూర్‌లో జరిగిన మిలాద్-ఉన్-నబీ కార్యక్రమంలోనే మొదటిసారి కలుసుకున్నారని.. అదే తమిళనాడు పురోగతికి పునాది వేసిందని స్టాలిన్ నొక్కిచెప్పారు. ముస్లింలకు కష్టం వస్తే ముందుగా అండగా నిలిచేది ద్రవిడ మున్నేట్ర కజగమేనని స్టాలిన్ హామీ ఇచ్చారు. బీజేపీ, చౌకబారు, నిరంకుశ, నియంతృత్వ రాజకీయాలతో కలిసి పని చేసే పార్టీలను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతేకాకుండా గాజాలో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. పాలస్తీనియన్ల బాధలకు ముగింపు పలకడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ఒక మంచి పరిష్కారం త్వరలో రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న బాధలకు ఒకేసారి ముగింపు పలకాలన్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని నేను ఇప్పటికే చెప్పాను.. ఇప్పుడు మరోసారి నొక్కి చెబుతున్నానని స్టాలిన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa