ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చియా సీడ్స్ తినే విషయంలో అసలు చేయకూడని తప్పులు

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 11:10 PM

నీటిలో నానబెట్టి చియా సీడ్స్ తినడం అనేది సరైన పద్ధతే అయినప్పటికీ మరి కొన్ని సార్లు మాత్రం ఎలా పడితే అలా తింటున్నారు. ఈ అలవాటు కారణంగానే సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జీర్ణ శక్తిపై ప్రభావం పడుతోంది. చియా సీడ్స్ లో ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే..వీటిని తినే క్రమంలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటుంది. మరి చియా గింజలు తినే ప్రాసెస్ లో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.


చియా సీడ్స్


​చియా గింజలలో బోలెడన్ని పోషకాలుంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తోపాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా చియా సీడ్స్ ద్వారా జీర్ణ శక్తి మెరుగవుతుంది. అయితే..వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంతో పాటు రక్త సరఫరా మెరుగ్గా అయ్యేందుకు సహకరిస్తచాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కూడా చియా సీడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.


గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు బరువు తగ్గించడంలోనూ ఇవి ఎంతో తోడ్పడతాయి. వీటిని పెరుగు, జ్యూస్, స్మూతీలలో కలుపుకుని తినవచ్చు. అయితే ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ శక్తి మెరుగవుతుంది. పేగులలో కదలికలు తీసుకొచ్చి సులువుగా మలవిసర్జన జరిగేలా చూస్తుంది. నీటిలో నానబెట్టి వాటితో పాటు కలిపి తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. అయితే..ఇన్ ఫ్లమేషన్ తగ్గించడంలోనూ ఇది సాయపడుతుంది.


ఎవరికి అవసరం


ఇందాకే చెప్పుకున్నట్టుగా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అనేది జీర్ణ వ్యవస్థకు బూస్టప్ లాంటిది. సరైన విధంగా తీసుకుంటే చాలాత్వరగా ఉబ్బరం, గ్యాస్, లాంటివి కంట్రోల్ లోకి వస్తాయి. ఇలాంటి జీర్ణ సమస్యలున్న వారు తప్పకుండా చియా సీడ్స్ వాడాలి. వీరితోపాటు బరువు తగ్గాలనుకునే వారికి ఇన్ ఫ్లమేషన్ తగ్గించుకోడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.


ఇన్ ఫ్లమేషన్ అంటే కీళ్లలో మంట, వాపులు రావడం. చియా సీడ్స్ తీసుకుంటే ఈ ఇన్ ఫ్లమేషన్ కి చెక్ పెట్టవచ్చు. కేవలం ఇన్ ఫ్లమేషన్ తగ్గించడం ఒక్కటే కాదు. కాలేయం ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఇది ఎంతో తోడ్పడుతుంది. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంలోనూ చియా సీడ్స్ ఉపయోగపడతాయి. జీర్ణ సమస్యలకు మంచిది కదా అని ఎక్కువ మొత్తంలో వీటిని అసలు వాడకూడదు. ఇలా చేయడం వల్ల పొట్టలో ఇరిటేషన్ వచ్చి సమస్యలు మరింత పెరుగుతాయి.


పొరపాట్లు ఇవే


న్యూట్రిషనిస్ట్ రేణు రఖేజా చెప్పిన ప్రకారం చూస్తే..చియా సీడ్స్ తినే విషయంలో చాలా మంది మూడు పొరపాట్లు చేస్తున్నారు. అందులో మొట్ట మొదటిది ఏంటంటే..చియా గింజలను పొడిగా తీసుకోవడం. అంటే..వాటిని నేరుగా తినడం. చియా సీడ్స్ ని ఎప్పుడైనా సరే పొరపాటున కూడా నానబెట్టకుండా తినకూడదు. ఇలా నేరుగా సీడ్స్ తినడం వల్ల గొంతులో వాపు వస్తుందని హెచ్చరిస్తున్నారు రేణు రఖేజా. అంతే కాదు. పొట్టలో విపరీతమైన మంట రావడంతో పాటు పొట్ట ఉబ్బరం వస్తుంది.


ఇక అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే..చియా సీడ్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సాధారణంగా అయితే వీటి వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోవాలి. కానీ ఎప్పుడైతే వీటిని నేరుగా తింటారో అదే మలబద్ధకానికి దారి తీస్తుంది. ఈ సమస్య మరీ తీవ్రమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే..వీలైనంత వరకూ చియా సీడ్స్ ని సరైన విధంగా నానబెట్టి ఆ తరవాతే తినే ప్రయత్నం చేయాలి.


నీళ్లు కలపకపోవడం


ఇక చాలా మంది చేసే మరో పొరపాటు ఏంటంటే..కాసిన్ని గింజలకు ఎక్కువ నీళ్లు ఏం అవసరం పడతాయిలే అని ఏదో కొన్ని నీళ్లు పోసి అందులో చియా సీడ్స్ వేస్తారు. కానీ ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని చెబుతున్నారు రేణు రఖేజా. ఇందాకే చెప్పుకున్నట్టుగా చియా సీడ్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనికి నీరు కూడా తోడైతైనే అది సరైన విధంగా శరీరానికి అందుతుంది. అందుకే..చియా గింజలను నానబెట్టినప్పుడు నీళ్లు ఎక్కువగా పోయాలి.


సరిగ్గా తినే ముందు కూడా మరి కొన్ని నీళ్లు కలపాల్సి ఉంటుంది. ఇలా అయితేనే అది జెల్ లాగా మారుతుంది. దీని వల్ల పేగులలో మురికి అంతా త్వరగా బయటకు వెళ్లేందుకు అవకాశముంటుంది. అందుకే తప్పనిసరిగా నీళ్లు బాగా కలపాలి. ఇక అందరూ చేసే మరో పొరపాటు ఏంటంటే..అధిక మోతాదులో చియా సీడ్స్ తీసుకోవడం. మామూలుగా అయితే ఓ టేబుల్ స్పూన్ మేర రోజుకి వాడితే సరిపోతుంది. త్వరగా ఫలితాలు చూడాలన్న ఆరాటంలో చాలా మంది రెండు టేబుల్ స్పూన్స్ మేర వాడతారు. ఇది పొట్టలో ఇరిటేషన్ కి దారి తీస్తుంది.


మరి ఎలా తినాలి


అర టేబుల్ స్పూన్ లేదా టేబుల్ స్పూన్ మేర చియా సీడ్స్ తీసుకోవాలి. అందులో పావు లీటర్ నీళ్లు కలపాలి. కనీసం గంట పాటు అలాగే నానబెట్టాలి. కాస్త జెల్లీగా మారేంత వరకూ చూడాలి. ఆ తరవాత ఆ సీడ్స్ ని నీటితో పాటుగా తీసుకోవాలి. ఆ తరవాత గంట సమయంలోపు కనీసం అర లీటర్ నీళ్లు తీసుకోవాలి. ఇక ఇప్పుడిప్పుడే చియా సీడ్స్ వాడడం అలవాటు చేసుకునే వాళ్లైతే ముందుగా అర టేబుల్ స్పూన్ తో మొదలు పెడితే సరిపోతుంది. ఆ తరవాత క్రమంగా ఓ టేబుల్ స్పూన్ మేర వాడడం అవసరం. చియాలో ఉండే ఫైబర్ సులువుగా మల విసర్జన జరిగేందుకు సహకరిస్తుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa