కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మధ్య ఉన్న అనుబంధంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ వర్గీయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీశాయి. బహిరంగ ప్రదేశాల్లో రాహుల్ తన సోదరి పట్ల చూపే ఆప్యాయత, అనురాగం భారతీయ సంస్కృతికి విరుద్ధమని ఆయన తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఈ ప్రవర్తన విదేశాల నుంచి తెచ్చుకున్న విలువలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
మధ్య ప్రదేశ్‌లోని షాజాపూర్‌లో గురువారం బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కైలాశ్ విజయవర్గీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. సంప్రదాయాలు, విలువలకు ప్రాధాన్యత ఇచ్చే పాత తరానికి చెందిన వాళ్లమని చెప్పుకొచ్చారు. "మేము పాత సంస్కృతికి చెందినవాళ్లం. మా సోదరీమణుల గ్రామంలో మేము కనీసం నీళ్లు కూడా తాగము. మా అత్తగారు నివసించిన జిరాపూర్‌కు మా తండ్రి వెళ్లినప్పుడు కూడా ఇంటి నుంచి కుండలో నీరు తీసుకెళ్లేవారు" అని తమ కుటుంబ సంప్రదాయాలను వివరించారు.
అనంతరం కాంగ్రెస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "కానీ నేటి మన ప్రతిపక్ష నాయకులు వారి సోదరీమణులను నడి రోడ్డుపైనే ముద్దు పెట్టుకుంటున్నారు" అని తీవ్రంగా విమర్శించారు. సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, మీలో ఎవరైనా బహిరంగంగా మీ సోదరిని లేదా కూతురిని ముద్దు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ఇలా ఎవరూ చేయలేరని, ఇది విలువులు లేకపోవడమే అవుతుందని అన్నారు. ఇవన్నీ విదేశాల్లో పెరగడం వల్ల వచ్చిన విదేశీ విలువలని చెప్పారు. అంతేకాకుండా వారు మన ప్రధాన మంత్రితో కూడా అమర్యాదగానే మాట్లాడతారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ బహిరంగ సభలు, కార్యక్రమాలలో ప్రియాంక గాంధీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి దృశ్యాలను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం అవుతోంది.
కైలాశ్ విజయ వర్గీయ వ్యాఖ్యలు తక్షణమే రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలో సోదరి-సోదరుడి పవిత్ర బంధాన్ని కించపరచడం దారుణమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ పట్వారీ వంటి నాయకులు మండిపడ్డారు. అయితే తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంపై స్పందించిన కైలాశ్ విజయ వర్గీయ ఏమాత్రం వెనక్కి తగ్గలేరు. తన వ్యాఖ్యలను మళ్లీ సమర్థించుకున్నారు. ఈ విషయంలో అది రాహుల్ గాంధీ తప్పు కాదని వ్యాఖ్యానిస్తూ.. తప్పును ఆయన పెంపకంపైకి మళ్లించారు.
"అది ప్రతిపక్ష నేత తప్పు కాదు. ఆయన విదేశాల్లో చదువుకొని, అక్కడి సంస్కృతి, విలువలను ఇక్కడికి తీసుకొచ్చారు. రాహుల్‌కు భారతీయ సంప్రదాయాలు, విలువలు గురించి కనీస అవగాహన లేదు. అందుకే ఆయన ప్రధాన మంత్రిని కూడా అమర్యాదగా 'నువ్వు' అని సంబోధిస్తారు" అంటూ విజయ వర్గీయ పునరుద్ఘాటించారు. ఈ విధంగా వ్యక్తిగత ఆరోపణలు, సంస్కృతి, సంప్రదాయాల అంశాలతో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ద్వారా ఆయన మరోసారి వార్తల్లోకెక్కారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa