ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్‌ కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర.. పాక్ ప్రధాని ప్రకటనతో భారత్‌లో మళ్లీ చర్చ

international |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 09:13 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం వణికిపోయిన సంగతి తెలిసిందే. భారత్ చేస్తున్న దాడుల వర్షాన్ని తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చింది. ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలం కావడంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ చోటు చేసుకుంది. అయితే అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు భారత్, పాక్ మధ్య అణు యుద్ధం జరగకుండా తానే అడ్డుకున్నానంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం రాకుండా ఆపానని చెప్పుకుంటున్నారు. అయితే ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ఎప్పటి నుంచో భారత్ తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ వ్యాఖ్యలను బలపరుస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటన చేయడంతో.. ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఓవల్ ఆఫీస్‌లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ తాజాగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ విడుదల చేసిన ఒక ప్రకటన తీవ్ర దుమారానికి కారణం అయింది. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు సౌకర్యాలు కల్పించినందుకు.. ట్రంప్ ధైర్యవంతమైన, సాహసోపేతమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందించారని ఆ ప్రకటనలో పాక్ పేర్కొంది. ఈ ప్రకటన ద్వారా.. భారత్ పాక్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందని పాకిస్తాన్ మరోసారి బహిరంగంగా అంగీకరించినట్లయింది.


అయితే.. పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు చనిపోయిన తర్వాత.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణలో డొనాల్డ్ ట్రంప్ జోక్యం ఉన్నట్టు వచ్చిన వార్తలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణపై పాకిస్తాన్ మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తనను సంప్రదించినట్లు.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో స్పష్టం చేశారు.


ఆ తర్వాతే పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్.. భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ను సంప్రదించినట్లు చెప్పారు. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ 22వ తేదీ నుంచి కాల్పుల విరమణ ప్రకటించిన జూన్ 17వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని ఈ సందర్భంగా జైశంకర్ స్పష్టం చేశారు.


మరోవైపు.. 2016 ఉరీ సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కంటే భిన్నంగా.. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను టెక్నాలజీ పరంగా మరింత శక్తివంతంగా, విస్తృతంగా సాగించింది. ఈ ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్ ఏకంగా 24 క్షిపణులను ప్రయోగించి.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో సహా పాకిస్తాన్‌లోని 9 ప్రాంతాల్లోని ఉగ్రవాద, సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో రాడార్లు, హ్యాంగర్లు, అత్యంత విలువైన ఏడబ్ల్యూఏసీఎస్ వంటి విమానాన్ని కూడా భారత సైన్యం నేలమట్టం చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa