ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఉచిత బస్సు పథకం.. ఏసీ బస్సుల్లోనూ ఫ్రీగా ప్రయాణం, కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 09:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకం అమలవుతోంది. ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే స్త్రీ శక్తి పథకాన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఆయన తాడిపత్రిలో ఆర్టీసీ డిపోను పరిశీలించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో సిటీ, పల్లెటూర్లకు వెళ్లే ఎలక్ట్రిక్ ఏసీ పల్లె వెలుగు సర్వీసుల్లో త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందన్నారు.


రాష్ట్రంలో త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. 300 బస్సులు తిరుపతికి, మిగిలిన 700 బస్సులు 13 ప్రాంతాలకు కేటాయిస్తామన్నారు. స్త్రీ శక్తి పథకంతో రోజూ లక్షలాది మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారన్నారు. తాడిపత్రి ఆర్టీసీ డిపో, బస్టాండ్‌ను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లోని సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తాడిపత్రి బస్టాండ్‌‌పై కప్పుకు పెచ్చులు ఊడటాన్ని గమనించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని తిరుమలరావు ఆదేశించారు. పనులు త్వరలో ప్రారంభించి.. బస్టాండ్‌లో ఈ సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.


రాష్ట్రంలో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఆర్టీసీకి కొత్తగా 1050 ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తున్నాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఆయన ఈడీఈ చెంగల్‌రెడ్డితో కలిసి కడప గ్యారేజీని, బస్టాండును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజీ, బస్టాండు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. కడప ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి, ఇతర అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కడప ఆర్టీసీ బస్టాండు ఆవరణలో రూ.1.30 కోట్లతో సిమెంటు రోడ్డు పనులు త్వరలో మొదలవుతాయని తెలిపారు. కడప ఆర్టీసీ బస్టాండు ప్రాంగణాన్ని పూర్తిగా సిమెంటు రోడ్డుతో బాగు చేస్తామని.. దీనికి రూ.1.30 కోట్లు ఖర్చు అవుతుందని.. ఈ పనులు త్వరలోనే మొదలవుతాయన్నారు.


ఆర్టీసీ బస్టాండ్లలో గతంలో వర్షాలకు నీరు నిలిచేదని.. ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు ఆర్టీసీ ఎండీ. 'స్ర్తీశక్తి పథకం' వల్ల బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళల ఓర్పు, సహనం అభినందనీయం అన్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినందున, అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల కోసం కుర్చీలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను మరింత నాణ్యతతో అందిస్తామని హామీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే, మన రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు ఎంతో ఓర్పు, సహనంతో ఉన్నారని, ఇది చాలా అభినందనీయం అన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa