తమిళనాడులో టీవీకే అధినేత, నటుడు విజయ్ ర్యాలీలో శనివారం రాత్రి తొక్కిసలాట చోటుచేసుకుని, 40 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. అయితే, ఈ ఘటన వెనుక డీఎంకే కుట్ర ఉందని టీవీకే సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని మద్రాసు హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ వేసింది. ఆ పార్టీ తరఫున పిటిషన్ వేసిన లాయర్ అరివఝగన్ మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లేదా సీబీఐకి బదిలీ చేయాలని కోరినట్టు తెలిపారు. కరూర్ ర్యాలీలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించారనే ప్రభుత్వ ఆరోపణలను అతడు తోసిపుచ్చాడు. సోమవారం మద్రాసు హైకోర్టు విచారణ సమయంలో ఈ అంశాలను లేవనెత్తుతామని చెప్పారు.
‘‘కరూర్ దుర్ఘటన వెనుక కుట్ర ఉంది... కాబట్టి గౌరవనీయమైన ఉన్నత న్యాయస్థానం దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలి.. కోర్టు సిట్‌ను వేయడం లేదా తమిళనాడు పోలీసుల నుంచి సీబీఐకి అప్పగించాలి’ అని డిమాండ్ చేశారు. తమిళనాడు పోలీసుల విచారణపై నమ్మకం లేదా? అని ప్రశ్నించగా.. ‘క్రిమినల్ కుట్ర ఉంది.. స్థానికులు నుంచి దీనిపై మాకు నమ్మదగిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్‌లు ఉన్నాయి.. కరూర్ జిల్లాల్లోని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులకు ఈ కుట్రతో సంబంధం ఉందనడానికి ఆధారాలు ఉన్నాయి’’ అని ఆరోపించారు. కరూర్ తొక్కిసలాటలో చిన్నారులు, మహిళలు సైతం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం
పోలీసుల మార్గదర్శకాలను ఉల్లఘించారనే ప్రభుత్వ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన అరివఝగన్.. మేము ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ‘గత కొద్ది నెలలుగా టీవీకే మదురై, తిరుచ్చి, అరియలూర్, తిరువరూర్, నాగపట్టణం, నమక్కల్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహించింది.. మరి కరూర్‌లోనే ఎందుకు ఇలా జరిగిందనేది మా ప్రశ్న.. అనేక సందేహాలు కలుగుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు.
కుట్ర సిద్ధాంతంపై డీఎంకే స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా.. ‘దీనిని మేము రాజకీయం చేయాలనుకోవడం లేదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. ఇటువంటి ఆరోపణలు చేసేవారు ముందు తమ పార్టీ నాయకత్వం ఎలా ప్రవర్తించిందో ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని బదులిచ్చారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం.. కరూర్‌లో విజయ ర్యాలీ జరిగే ప్రదేశానికి మధ్యాహ్నం నుంచే జనం చేరుకున్నారు. కానీ, ఆయన రాక ఆలస్య కావడం, సామర్థ్యానికి మించి జనం హాజరయ్యారు. ఈ జాప్యం ఉద్దేశపూర్వకంగా జరిగిందని, టీవీకే నాయకులు జనసమూహం పెరగాలని కోరుకున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, ఈ ఆరోపణల్లో నిజం లేదని టీవీకే పార్టీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa