ట్రెండింగ్
Epaper    English    தமிழ்

148 ఏళ్ల ఆలయంలో నవరాత్రోత్సవాలు.. 7 కిలోల బంగారు, 12 కిలోల వెండి, రూ.5 కోట్ల కరెన్సీతో అలంకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 06:59 PM

దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయాలు, మండపాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి.. రోజుకో అవతారంలో నవరాత్రులు 9 అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఇక చాలా చోట్ల నిత్యం ఏదో ఒక అవతారంలో అమ్మవారిని అద్భుతంగా అలంకరిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖలోని ఓ పురాతన ఆలయంలో అమ్మవారిని భారీగా డబ్బు, నగలతో అలంకరించారు. ఇప్పుడు ఆ అమ్మవారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


విశాఖ నగరంలోని ఓల్డ్‌ టౌన్‌ పరిధిలో ఉన్న కురుపాం మార్కెట్‌ ప్రాంతంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 148 ఏళ్ల పురాతనమైన కన్యకాపరమేశ్వరి ఆలయంలో నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున అమ్మవారిని మహాలక్ష్మి అలంకరణలో తీర్చిదిద్దారు. ఇందుకోసం భారీ మొత్తంలో బంగారం, వెండి, డబ్బును అమ్మవారికి సమర్పించారు. 7 కిలోల బరువైన బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లతోపాటు.. 12 కిలోల వెండి ఆభరణాలు అమ్మవారికి అలంకరించారు. వీటితోపాటు.. రూ.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతోనూ అద్భుతంగా అలంకరించడంతో.. అమ్మవారు దగ దగా మెరిసిపోయారు.


ఇక నవరాత్రోత్సవాల సందర్భంగా కన్యకాపరమేశ్వరి ఆలయంలో 250 మంది మహిళలతో కోటి కుంకుమార్చన నిర్వహించినట్లు ఆ దేవస్థాన సంఘం అధ్యక్షులు ఆరిశెట్టి దినకర్‌, కార్యదర్శి పెనుగొండ కామరాజు వెల్లడించారు. ఇక పురాతన ఆలయమైన కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


శ్రీశైలంలో ఘనంగా దసరా ఉత్సవాలు


జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. సోమవారం రోజున భ్రమరాంబ అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నందిని వాహనంగా చేసుకుని 4 చేతుల్లో వర, అభయ ముద్రలతోపాటు త్రిశూలం, ఢమరుకాన్ని ఆయుధాలుగా ధరించి తెల్లని రంగులో శాంతస్వరూపిణిగా భక్తులను అమ్మవారు కటాక్షించారు.


నవదుర్గలలో మహాగౌరి రూపం అత్యంత శాంతమూర్తి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ, ఏకాంత సేవలను నిర్వహించారు. ఉత్సవాల్లో ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టాలు, పారాయణలు, చండీహోమం, పంచాక్షరి, బ్రామరి, బాలా జపానుష్టాలు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారి పూజలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa