ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయ ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా మారాలని ఆకాంక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 06:22 AM

ప్రపంచాన్ని యాచించే దశను భారత్ దాటిందని, ఇకపై ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం కేవలం ఒక నినాదంగా మిగిలిపోకూడదని, అదొక మహోద్యమంగా మారినప్పుడే దేశం ఆర్థికంగా అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం నాడు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’లో భాగంగా నిర్వహించిన ‘ఖాదీ సంత’ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. చేతివృత్తుల కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు, ఆర్గానిక్ వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు. స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను గుర్తుచేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్టాల్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఉన్న రాట్నంపై నూలు వడికి గాంధీజీని స్మరించుకున్నారు. విజయదశమి పర్వదినాన ప్రారంభించిన ఈ స్వదేశీ సంత కార్యక్రమం గొప్ప విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్వదేశీ సంత భవిష్యత్తులో గ్లోబల్ సంతగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం, సంపద మన జనాభాయే. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ మన దేశమే. ‘బీ ఇండియన్, బై ఇండియన్’ భారతీయుడిగా ఉండు, భారతీయ వస్తువులనే కొనుగోలు చేయి అనే నినాదం ప్రతి ఒక్కరిలో రావాలి. మన ఉత్పత్తులను మనమే వినియోగించుకుంటే, డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది" అని అన్నారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో గాంధీజీ విదేశీ వస్త్రాలను తగలబెట్టమని ఇచ్చిన పిలుపు ఉద్యమానికి ఎలా ఊపిరి పోసిందో గుర్తుచేశారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, గ్రామ స్వరాజ్య మార్గాలతో పాటు స్వదేశీ నినాదాన్ని కూడా నేడు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదంలాగే, స్వదేశీ ఉద్యమాన్ని మళ్లీ పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.భారతదేశం నేడు అత్యంత పటిష్టమైన స్థితిలో ఉందని చంద్రబాబు అన్నారు. "ఒకప్పుడు చిన్న శాటిలైట్ ప్రయోగానికి కూడా ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు కూడా ఉపగ్రహాలు తయారు చేసి ప్రయోగించే స్థాయికి చేరుకున్నాం. కోవిడ్ మహమ్మారి సమయంలో మన దేశంలో తయారైన వ్యాక్సిన్లే ప్రపంచ దేశాల ప్రజల ప్రాణాలను కాపాడాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి అగ్రస్థానంలో నిలుస్తాం. ఇదే మనం భరతమాతకు ఇచ్చే నిజమైన నివాళి" అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ 2.0 వంటి సంస్కరణలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతున్నాయని, వాటి ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయని వివరించారు.ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. "కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, చేనేత వస్త్రాలు, కొబ్బరి ఉత్పత్తులు వంటి ఎన్నో నాణ్యమైన వస్తువులు మన రాష్ట్రంలో తయారవుతున్నాయి. వీటిని మనమే ప్రోత్సహించాలి. గతంలో మేం ప్రమోట్ చేసిన అరకు కాఫీ నేడు అంతర్జాతీయంగా గొప్ప బ్రాండ్‌గా మారింది. అదే విధంగా మిగతా ఉత్పత్తులకు కూడా గుర్తింపు తీసుకురావాలి" అని తెలిపారు. ఏటికొప్పాక, కొండపల్లి కళలతో పాటు చేనేత పరిశ్రమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ‘వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్’ విధానాన్ని తీసుకొచ్చి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను, ఆ తర్వాత వాజ్‌పేయి వాటికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. సంస్కరణలను అందిపుచ్చుకోవడం ద్వారానే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు. విజయదశమి రోజున దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతామని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు, చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన పట్టుచీరను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు చంద్రబాబు బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa