తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ప్రజలు చేస్తున్న నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. పీఓకే పౌరులపై పాకిస్తాన్ దళాలు అణచివేత ప్రారంభించడంతో.. హింస చెలరేగి 10 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇక పీఓకే ప్రజలు చేస్తున్న ఆందోళనలు, వాటిని అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. పీఓకేలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలు, అమాయక పౌరులపై పాకిస్తాన్ బలగాల దౌర్జన్యాలపై వచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు.
పాకిస్తాన్ అణిచివేత విధానం, బలవంతపు, చట్టవిరుద్ధ ఆక్రమణలో ఉన్న ఈ భూభాగాల నుంచి వనరులను వ్యవస్థాగతంగా దోచుకోవడం వంటి అకృత్యాలకు పాల్పడినందుకు పర్యవసానంగానే ఈ పరిస్థితి తలెత్తిందని భారత్ నమ్ముతోందని.. రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాకిస్తాన్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు.. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు శుక్రవారం నాటికి ఆరో రోజుకు చేరుకున్నాయి. పాకిస్తానీ దళాలు 10 మందిని చంపడంతో, ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేకేజేఏఏసీ) ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తోంది. 38 పాయింట్ల డిమాండ్లలో భాగంగా.. సబ్సిడీపై గోధుమ పిండి సరఫరా చేయాలని పేర్కొంది. విద్యుత్ సుంకాల తగ్గింపు.. ఉచిత విద్య, ఆరోగ్య సదుపాయాలు.. ప్రభుత్వ అధికారుల ప్రత్యేక అధికారాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఆందోళనకు కేంద్ర బిందువుగా మారిన ముజఫరాబాద్‌లో దుకాణాలు, మార్కెట్లు, రవాణా సేవలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య కొత్తగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నీలమ్ బ్రిడ్జి వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రదర్శనకారులపై పాక్ అధికారులు కాల్పులు జరిపారని జేకేజేఏఏసీ నాయకులు ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ పబ్లిక్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ముజఫరాబాద్ పౌరులు నీలమ్ బ్రిడ్జిపై శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా.. కొంతమంది పోలీసుల సమక్షంలోనే ఆయుధాలతో వచ్చి నేరుగా కాల్పులు జరిపారని జేకేజేఏఏసీ నాయకుడు షౌకర్ నవాజ్ మీర్ ఆరోపించారు.
ఈ కాల్పుల్లో ఒక యువకుడు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారని, ఈ కాల్పులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమని ఆయన పేర్కొన్నారు. పీఓకేలో 64 శాతం నిరుద్యోగం రేటు ఉందని.. తమ యువత 1947 నుంచి ఉన్న 25 శాతం కోటా వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారని మరో జేకేజేఏఏసీ నాయకుడు ఫైసల్ జమీల్ కాశ్మీరీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa