భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ ఉపరితలంపై ఉండే సైనిక ఉద్రిక్తతలు.. ఇటీవల గుజరాత్‌లోని సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతం వద్దకు చేరుకున్నాయి. ఈ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడకుండా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సర్ క్రీక్‌లోని భారత్‌కు చెందిన భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరిగితే.. దానికి ఫలితంగా చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారుతాయని రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. గుజరాత్ సహా ఇతర ప్రాంతాల్లో సరిహద్దు వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్ ఉద్దేశాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయని కేంద్రమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు.
సర్ క్రీక్ ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇటీవల పాకిస్తాన్.. బంకర్లు, రాడార్లు, డ్రోన్లను, పదాతిదళ కార్యకలాపాలను ప్రారంభించగల ముందు స్థావరాలను నిర్మించడం ఆ దేశ వైఖరిని తెలియజేస్తోందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అయితే కరాచీకి వెళ్లే ఒక మార్గం సర్ క్రీక్ ద్వారా వెళ్తుందనే విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని రక్షణమంత్రి హెచ్చరించారు.
సర్ క్రీక్ అంటే ఏంటి?
గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్, పాకిస్తాన్ మధ్య ఉన్న సముద్రతీరపు ఉప్పునీటి కాలువనే సర్ క్రీక్ అని పిలుస్తారు. ఇది 100 కిలోమీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య అధికారిక పశ్చిమ సరిహద్దుగా ఉంది. ఈ వివాదం దేశ విభజన, స్వాతంత్య్రానికి ముందే.. కచ్ మహారాజా పాలన నాటి నుంచి ఉంది. 1914 నాటి తీర్మానం ప్రకారం.. ఈ ఉప్పునీటి కాలువకు తూర్పున ఉన్న ఒడ్డును సరిహద్దు రేఖ అని పాకిస్తాన్ వాదిస్తోంది. అయితే.. అంతర్జాతీయంగా ఆమోదించిన థాల్‌వెగ్ సూత్రాన్ని భారత్ అనుసరిస్తుంది. దీని ప్రకారం.. ఒక జలమార్గం గుండా సరిహద్దును పంచుకునే 2 దేశాల మధ్య సరిహద్దు.. ప్రధాన కాలువలో అత్యంత లోతైన భాగం ద్వారా వెళ్తుంది. 1925 నాటి మ్యాప్ కూడా కాలువ మధ్యభాగమే సరిహద్దు అని సూచిస్తోంది.
సర్ క్రీక్ వ్యూహాత్మక ప్రాముఖ్యత
సర్ క్రీక్ ప్రాంతంపై నియంత్రణ సాధించడం అనేది భారత్-పాక్ సముద్ర సరిహద్దు సమస్యను ప్రభావితం చేయడమే కాకుండా.. ఎవరైతే నియంత్రణ సాధిస్తారో వారికి గణనీయమైన వ్యూహాత్మక ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఉదాహరణకు.. భారత్ తన వైపు సైనిక ఉనికిని కొనసాగించడం పాకిస్తాన్‌కు ఒక నిరోధకంగా పనిచేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్‌కు చెందిన అతిపెద్ద వాణిజ్య కేంద్రం అయిన కరాచీ పోర్టుకు సముద్ర మార్గాన్ని నేరుగా చేరుకోగలిగే అవకాశాన్నిస్తుంది.
మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సంభవిస్తే.. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలు పెరిగితే, భారత బలగాలను ఇరువైపులా విస్తరించడానికి ప్రయత్నించే పిన్సర్ మూవ్‌మెంట్‌కు ఆస్కారం ఉంటుంది. ఈ ప్రాంతం పాక్ నేవీ.. తమ యుద్ధనౌకలను గుజరాత్ తీరానికి సమీపంలో ఉంచడానికి.. తద్వారా తమ భద్రతను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సర్ క్రీక్ ప్రాంతం కేవలం సైనికపరంగానే కాకుండా.. ఆర్థికంగా, భద్రతాపరంగా కూడా రెండు దేశాలకు కీలకంగా నిలుస్తోంది.
ఈ సర్ క్రీక్ ప్రాంతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద చేపల వేట స్థావరాల్లో ఒకటిగా నిలిచింది. అయితే సరిహద్దు వివాదం కారణంగా తరచుగా ఇరు దేశాల మత్స్యకారులను కోస్ట్ గార్డు సిబ్బంది అరెస్ట్ చేస్తుంటారు. ఇక సర్ క్రీక్ ప్రాంతంలో సముద్ర గర్భంలో భారీగా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా ఈ నిల్వలకు సంబంధించిన పరిశోధనలు నిలిచిపోయాయి.
2019 సెప్టెంబర్‌లో పాకిస్తానీ ప్రత్యేక దళాల సైనికులు గుజరాత్‌లోకి చొరబడి ఉగ్రదాడికి ప్రయత్నిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం తర్వాత ఈ ప్రాంతంలో వదిలివేసిన పడవలను కనుగొన్నారు. దీంతో అప్పటి నావికాదళ అధిపతి కూడా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు నీటి అడుగున దాడులు చేసేందుకు తమ సభ్యులకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో కేవలం గుజరాత్‌కే కాకుండా.. దక్షిణ తీరం వెంబడి కేరళ వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నిర్ణయం సర్ క్రీక్ ప్రాంతానికి ఉన్న అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa