ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిశు మరణాలకు ప్రభుత్వ దగ్గు మందే కారణమా? రాజస్థాన్ ఆరోగ్య శాఖ క్లారిటీ

national |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 08:13 PM

రాజస్థా‌న్‌లోని భరత్‌పూర్, సికార్ జిల్లాల్లో ఇటీవల జరిగిన ఇద్దరు చిన్నారుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత మందుల పంపిణీ పథకం కింద అందించే దగ్గు సిరప్‌కు ఎలాంటి సంబంధం లేదని రాజస్థాన్ ఆరోగ్య శాఖ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ప్రజారోగ్య డైరెక్టర్ రవి ప్రకాష్ శర్మ ఈ విషయంపై మాట్లాడుతూ.. రెండు కేసుల్లోనూ విచారణ నివేదికలు పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. చనిపోయిన పిల్లలకు డాక్టర్ సలహా లేకుండానే ఇంట్లో సిరప్ తాగించినట్లు విచారణలో తేలింది. వైద్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలకు డెక్స్ట్రోమెథోర్ఫాన్ అనే ఔషధాన్ని సూచించకూడదన్నారు. ఇది ప్రోటోకాల్‌గా ఉందని.. ఆ రెండు సంఘటనల్లోనూ డాక్టర్లు ఈ మందును సూచించలేదని రవి ప్రకాష్ శర్మ ఆ ప్రకటనలో వివరించారు.


తక్కువ నాణ్యత కలిగిన దగ్గు సిరప్‌పై మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే.. రాష్ట్ర ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (RMSCL) తక్షణమే ఆ ఔషధం సరఫరాను, వాడకాన్ని నిలిపివేసింది. అంతేకాకుండా ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి ఒక ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నివేదికల వాస్తవికతను తెలుసుకోవడానికి, సేకరించిన ఔషధ నమూనాలను రాష్ట్ర ఔషధ ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించారు.


ఈ ఘటనల నేపథ్యంలో.. ఆరోగ్య శాఖ కీలకమైన సలహా పత్రం విడుదల చేసింది. వైద్యులు తప్పనిసరిగా మందులు సూచించే ప్రోటోకాల్‌లను కచ్చితంగా పాటించాలని, అలాగే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులను పంపిణీ చేయాలని ఫార్మసిస్ట్‌లను ఆదేశించింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. డాక్టర్ల సలహా లేకుండా సొంతంగా ఏ మందులనూ తీసుకోవద్దని.. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది. ఈ చర్యలన్నీ ఔషధాల పంపిణీ, వాడకంలో పారదర్శకతను, భద్రతను పెంచడానికి ఉద్దేశించినవని చెప్పింది. మొత్తం మీద ఈ నివేదికలు ప్రభుత్వ సిరప్‌పై వచ్చిన ఆరోపణలను పక్కన పెడుతూ.. మరణాలకు కారణం స్వీయ వైద్యం, ప్రోటోకాల్ ఉల్లంఘన అని తేల్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa