ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్‌లో కూలిన పాక్ ఫైటర్ జెట్లు.. ఐఏఎఫ్ చీఫ్

national |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 08:14 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి.. భారత వైమానిక దళం అధిపతి అమర్ ప్రీత్ సింగ్ సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్‌తో జరిగిన సైనిక ఘర్షణ సందర్భంగా 4 నుంచి ఐదు పాకిస్తానీ ఫైటర్ జెట్‌లను భారత వైమానిక దళం కూల్చివేసినట్లు స్పష్టం చేశారు. వాటిలో అమెరికా తయారుచేసిన ఎఫ్-16 లు, చైనా తయారుచేసిన జేఎఫ్-17 రకానికి చెందిన యుద్ధ విమానాలను కూల్చేసినట్లు తెలిపారు. 93వ వైమానిక దళ దినోత్సవాల సందర్భంగా ప్రసంగించిన ఐఏఎఫ్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్.. భారత యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయని పాకిస్తాన్ చేస్తున్న వాదనలను ఆయన కొట్టిపారేశారు.


పాకిస్తాన్ చేస్తున్న ప్రకటనలు.. వారి సొంత పౌరులను తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రచారమని విమర్శించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో పాకిస్తాన్‌కు జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ వివరించారు. ఈ దాడుల్లో కనీసం 4 నుంచి 5 ఫైటర్ జెట్‌లు (ఎఫ్-16, జేఎఫ్-17 ) కూల్చేసినట్లు వెల్లడించారు. ఎఫ్-16లు ఉన్న స్థావరంపై భారత సైన్యం దాడి చేయడం వల్ల.. మెయింటెనెన్స్ కోసం ఉన్న విమానాలు దెబ్బతిన్నట్లు సంకేతాలు ఉన్నాయని తెలిపారు. అనేక పాకిస్తానీ ఎయిర్‌బేస్‌లు, స్థావరాలపై దాడులు జరిగాయని వివరించారు.


కనీసం 4 చోట్ల రాడార్లు, 2 చోట్ల కమాండ్ కంట్రోల్ సెంటర్‌లు, 2 రన్‌వేలు, 3 వేర్వేరు స్టేషన్లలో ఉన్న 3 హ్యాంగర్‌లు ధ్వంసం అయ్యాయి. సీ-130 తరగతికి చెందిన ఒక రవాణా విమానం, బహుశా ఒక హై-వాల్యూ నిఘా విమానం కూడా దెబ్బతిన్నట్లు తమ వ్యవస్థలు నిర్ధారిస్తున్నాయని అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.


వీటన్నింటితోపాటు ఒక సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ వ్యవస్థ కూడా నాశనమైందని తెలిపారు. ఈ ఆపరేషన్ సిందూర్ ఐఏఎఫ్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన, విజయవంతమైన దాడి అని ఐఏఎఫ్ చీఫ్ వెల్లడించారు. 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ క్షిపణి దాడికి గుర్తుగా ఈ ఆపరేషన్ నిలిచిందని పేర్కొన్నారు.


ఇటీవల భారత్ ప్రవేశపెట్టిన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టూ మిసైల్‌లు పాక్ భూభాగంలోకి చాలా దూరం వరకు నిఘా వేయగలిగాయని.. ఈ కారణంగానే పాకిస్తాన్ తన సొంత భూభాగంలో కూడా కొంత వరకు తన కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందని వైమానిక దళాధిపతి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa