ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ,,,,భారత పర్యటనకు తాలిబన్ మంత్రి

international |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 08:19 PM

అఫ్గానిస్తాన్ తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ త్వరలో భారత దేశంలో పర్యటించనున్నారు. తాలిబన్ ప్రభుత్వం తరఫున ఒక ఉన్నత స్థాయి నాయకుడు భారత్‌కు రావడం ఇదే తొలిసారి కానుంది. ముత్తఖీ పర్యటనకు అవసరమైన అంతర్జాతీయ ప్రయాణ నిషేధం నుంచి ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ తాత్కాలిక మినహాయింపును మంజూరు చేయడంతో.. ఈ కీలక దౌత్యపరమైన ముందడుగు సాధ్యమైంది. 2021 ఆగస్టులో తాలిబన్ అఫ్గానిస్తాన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత.. ఆ ప్రభుత్వం నుంచి భారత్‌కు అధికారికంగా వస్తున్న మొట్ట మొదటి సీనియర్ స్థాయి మంత్రి ముత్తఖీ కావడం విశేషం. ఈ పర్యటనతో భారత్-అఫ్గాన్ సంబంధాలలో కొత్త అధ్యాయం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


వాస్తవానికి ముత్తఖీ గత నెలలోనే భారత్‌లో పర్యటించడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పటికే ఆయనపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విధించిన ఆంక్షలు అమలులో ఉండటం వల్ల విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక మినహాయింపు అవసరమైంది. గతంలో ఆయన పర్యటనకు అనుమతి కోరగా.. ఆంక్షల కమిటీ దానిని తిరస్కరించింది. దాంతో సెప్టెంబర్‌లో జరగాల్సిన పర్యటన రద్దు అయింది. అయితే ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ముత్తఖీ విజ్ఞప్తిని పరిశీలించి.. ఆయనపై ఉన్న అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నుంచి తాత్కాలిక మ మినహాయింపును ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. ఈ తాత్కాలిక మినహాయింపు నిర్ణయాన్ని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. ఇలా ముత్తఖీ అధికారిక భారత పర్యటనకు మార్గం సుగమమైంది. ఈక్రమంలోనే ఆయన అక్టోబర్ 9వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య న్యూఢిల్లీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.


 ఈ పర్యటనలో ముత్తఖీ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సహా ఇతర ఉన్నతాధికారులను కలిసే అవకాశం ఉంది. అఫ్గానిస్తాన్‌లో భారతదేశం అందిస్తున్న మానవతా సహాయం గురించి, అభివృద్ధి ప్రాజెక్టుల పునఃప్రారంభం గురించి ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. అలాగే తీవ్రవాద నిరోధం, ప్రాంతీయ భద్రత అంశాలపై కూడా చర్చలు జరపవచ్చని తెలుస్తోంది. భారతదేశం ఇంతవరకు తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించనప్పటికీ.. అఫ్గానిస్తాన్ ప్రజలతో చారిత్రక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని మానవతా సాయం అందించడాన్ని కొనసాగిస్తోంది.


ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని.. ముఖ్యంగా వాణిజ్య, రవాణా సంబంధాల్లో పురోగతి ఉంటుందని దౌత్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పర్యటన పాకిస్థాన్‌పై అఫ్గానిస్తాన్ ఆధారపడటాన్ని తగ్గించడానికి, ప్రాంతీయంగా భారత్ ప్రభావాన్ని పెంచడానికి ఒక కీలకమైన అవకాశంగా పరిశీలకులు పరిగణిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa