మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)వారం ప్రారంభంలో చతుర్ధాధిపతి చంద్రుడు లాభంలో రాహువుతో, సప్తమ స్థానంలో కుజ, బుధులు యుతి, షష్ఠ స్థానంలో రవి, వారాంతంలో శుక్ర కన్యా రాశి ప్రవేశం, మొదలైన విషయాలు పరిగణించగా స్థిరాస్తుల విషయాలు మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ, వ్యవసాయ భూములు వాహనాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు. వారం మధ్యలో వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ నూతన బాధ్యతలు వల్ల అలసటగా అనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం, సలహా సంప్రదింపులు కోరుకుంటారు. జీవిత భాగస్వామి తో అభిప్రాయ బెదాలకు, ఈగో ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉండాలి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వారం చివరిలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి మరిన్ని మంచి ఫలితాల కొరకు అమ్మవారి ఆరాధన, ఆలయ సందర్శన మంచిది.
వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
వారం ప్రారంభంలో తృతీయాధిపతి చంద్రుడు దశమ స్థానంలో రాహువుతో, షష్ఠ స్థానంలో కుజబుధుల యుతి, పంచమ స్థానంలో సూర్యుడు, వారాంతంలో కన్యారాశిలో శుక్ర ప్రవేశం మొదలైనవి గమనించగా అధిక ఒత్తిళ్లతో సవాళ్లతో కూడిన వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉంటాయి. కొలీగ్స్ తో అభిప్రాయ బేధాలు, గాసిప్స్ కి దూరంగా ఉండాలి. వ్యక్తిగత విమర్శలు చేయరాదు. దూర ప్రదేశాలలో నూతన అవకాశాలు. వారం మధ్యలో విదేశీ అవకాశాలు తాత్కాలిక ప్రయాణాలు, ఆర్థిక విషయాలు అనుకూలత. అధికారులతో విభేదాలకు తావివ్వరాదు. వారం చివరిలో ఆరోగ్య మీద ప్రత్యేక శ్రద్ధ, ఆకర్షణ, శక్తి సామర్థ్యాలు పెరుగు తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల మీద ఆసక్తి పెరుగుతుంది అధిక శ్రమ చేస్తారు. ఆలోచనలు అనుకూలంగా సృజనాత్మకత పెరుగుతుంది. గృహ వాతావరణం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మంచి ఫలితాల కొరకు సూర్య ఆరాధన, నవగ్రహ దేవాలయ సందర్శన మంచిది
మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
వారం ప్రారంభంలో ద్వితీయాధిపతి చంద్రుడు నవమస్థానములో రాహువుతోను, పంచమ స్థానంలో కుజబుధు ల యుతి, చతుర్ధములో రవి, వారాంతంలో కన్యా రాశిలో శుక్ర ప్రవేశం మొదలైనవి గమనించగా ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి అనవసరమైన ఖర్చులను అధిగమించాలి, మాటల విషయంలో ముఖ్యంగా కుటుంబ సంబంధ అంశాలలో శ్రద్ధ తీసుకోవాలి గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. తండ్రి ఆరోగ్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. రావాల్సిన ధనం సమయానికి అందినప్పటికీ ప్రణాళికా పరంగా వెళ్లకపోవడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరమైన విషయాలలో అధికారులతో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి వారం మధ్యలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, చిన్ననాటి మిత్రులు కలుస్తారు మంచి చర్చలు చేస్తారు. ఆలోచనలు ఫలిస్తాయి సంతాన అభివృద్ధి కరంగా ముందుకు వెళతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబానికి బంధుమిత్రుల రాక. ఆత్మీయ వ్యక్తుల వరకు అధికంగా ఖర్చు చేస్తారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలు వినడం విష్ణు దేవాలయాలు సందర్శించడం మేలు.
కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
వారం ప్రారంభంలో రాశ్యాధి పతి అయిన చంద్రుడు రాహువుతో కలిసి అష్టమ స్థానంలోనూ, తృతీయములో రవి, చతుర్దములో కుజ బుధ యుతి, వారాంతంలో శుక్రుడు తృతీయ స్థాన ప్రవేశం ఫలితాంశములు గమనించగా ఏదో తెలియని మానసిక ఆందోళన ఉద్వేగాలు అధికంగా ఉంటాయి అనవసరమైన ఆలోచనలతో మనసుని కలవర పెట్టుకునే పరిస్థితి. అధిగమించే విధంగా మౌనంగా ఉండడం మెడిటేషన్ యోగా లాంటివి చేయడం మంచి ఫలితాలను ఇస్తాయి. ఇబ్బంది పెట్టే వ్యక్తుల వల్ల పనుల మీద శ్రద్ధ ఆసక్తి తగ్గుతుంది. మానసిక శారీరక ఆరోగ్యాల మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక విషయాలలోనూ, ఉన్నత విద్య తండ్రి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైన వాటిలో మిశ్రమ ఫలితాలు. వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల పనులు ముందుకు సాగడంలో ఆటంకాలు. వారం మధ్యలో వృత్తిపరమైన విషయాలలో మార్పుల కొరకు కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటారు, మీరున్న వృత్తిలో ఉన్నత స్థాయి స్త్రీలను సంప్రదించి చర్చించి ముందుకు వెళతారు. వారం చివరిలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసి శాంతంగా ఉంటారు. గృహ వాతావరణం, ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, వృత్తికి సంబంధించిన ఆలోచనలు మొదలైన వాటిలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మరిన్ని మంచి ఫలితాలు కొరకు దత్తాత్రేయ స్వామి దేవాలయ సందర్శన మంచిది
సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
వారం ప్రారంభంలో వ్యయాధిపతి అయిన చంద్రుడు సప్తమ స్థానంలో రాహువుతోను, ద్వితీయంలో రవి, తృతీయంలో కుజ బుధ యుతి, వారాంతంలో కన్య రాశిలో శుక్ర ప్రవేశం మొదలైనవి గమనించగా వ్యాపార విస్తరణ కొరకు దూర ప్రదేశాలకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులని సంతోషపరచడానికి అనవసర ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక విషయాలలో కొంత ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది. వారం మధ్యలో విమర్శలకు దూరంగా ఉండాలి. సంబంధం లేని వ్యక్తుల జోక్యం మనసు చిరాకును కలిగిస్తుంది. మీ సహకారానికి చేయూత ఇస్తున్నట్లు కనబడే వ్యక్తులలో స్వార్థపరులకు వీలైనంత దూరంగా ఉండాలి. వారం చివరిలో విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మంచిగా మాట్లాడి పనులను సాధించుకోగలుగుతారు. వాగ్దానాలు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. మరిన్ని మంచి ఫలితాల కొరకు ఆదిత్య హృదయం వినడం మంచిది
కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
ప్రారంభంలో లాభాధిపతి చంద్రుడు షష్టంలో రాహువుతో, వ్యయాధిపతి రవి జన్మంలోనూ , ద్వితీయంలో కుజ బుధ యుతి, వారాంతంలో రాశి లోకి శుక్ర ప్రవేశం మొదలైనవి గమనించగా పోటీలలో ప్రదర్శిస్తారు రుణములు తీరుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు దైనందన జీవితంలో మార్పులు, వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. వారం మధ్యలో ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద విజయం సాధిస్తారు. సంఘాల్లో మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయంలో, ఉన్నత స్థాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. వారం చివరిలో ముఖ్యమైన విషయాలు వాయిదా కలిగిస్తాయి. ప్రయాణాల్లో, నూతన నిర్ణయాల్లో ఆకస్మిక ఆటంకాలు. కుటుంబ సంబంధాల్ని నిలబెట్టుకోవడంలో మాటల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్లాలి. ఆధ్యాత్మికంశాల మీద దృష్టి సారిస్తారు దూర ప్రయాణాలు చేస్తారు. తండ్రి యొక్క ఆశీస్సులు లభ్యం. మరిన్ని మంచి ఫలితాల కొరకు లలితా సహస్రనామాలు వినడం మేలు
తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
వారం ప్రారంభంలో రాజ్యాధి చంద్రుడు పంచమ స్థానంలో రాహువుతోను, లాభాధిపతి రవి వ్య యంలోను, జన్మరాశి లో బుధ కుజ యుతి, దాదాపుగా వారాంతంలో లగ్న అష్టమాధిపతి శుక్రుడు వ్యయ స్థాన ప్రవేశం మొదలైన అంశాలు గమనించగా, పెంపొందించుకోవాలి వృత్తిపరమైన విషయాలు చిరాకులను అధిగమించాలి సంతాన వర్గానికి సంబంధించిన,పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరించాలి. వారం మధ్యలో మీ కింద పని చేసే సిబ్బంది సహకారం అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ అధికారులతో రాజకీయ నాయకులతో ముఖ్యమైన విషయాలు చర్చించేటప్పుడు తగిన విధంగా వినయంగా ముందుకు వెళ్లడం అవసరం. పన్నులు సకాలంలో చెల్లిస్తారు. వారం చివరిలో అధిక ఉద్వేగాలు ఉన్నప్పటికీ కూడా వృత్తికి సంబంధించిన విషయాలలో, భాగస్వామి వ్యవహారాలలో వీలైనంత మృదువుగా మాట్లాడుతూ పనులు సాధించుకుంటారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వృత్తిపరంగా కొత్తవారిని నమ్మేటప్పుడు ఆలోచించాలి. మరిన్ని మంచి ఫలితాల కొరకు దుర్గాదేవి ఆరాధన మంచిది
వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
వారం ప్రారంభంలో నవమాధిపతి అయిన చంద్రుడు చతుర్దంలో రాహుతోను,వ్యయ స్థానంలో కుజ బుధ యుతి, లాభ స్థానంలో రవి, వారాంతంలో కన్యా రాశిలో శుక్ర ప్రవేశం, గమనించగా తల్లితండ్రుల ఆరోగ్య విషయంలోనూ, గృహ వాహన అంశాలలోనూ, కుటుంబ సంబంధ అభివృద్ధి మొదలైన వాటికి సంబంధించి అధిక శ్రద్ధ తీసుకుంటారు. డ్రైవింగ్ చేసేవారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఆహారాలు స్వీకరించేటప్పుడు, కొత్త ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు విద్యా సంబంధవిషయాలు మీద డిస్ట్రక్షన్స్ రాకుండా జ్ఞాపకశక్తిని పెంచుకునే విధంగా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్లాలి. శ్రీ హయగ్రీవాయ నమః శ్లోకాన్ని జపించాలి. మధ్యలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులని పూర్తి చేసుకుంటారు. సోదరు వర్గంతో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్లాలి. వారసత్వపు ఆస్తుల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వారం చివరిలో వాహనానికి సంబంధించి ప్రశాంతత, వ్యాపార వ్యవహారాల విషయంలో కీలక మార్పులు చేస్తారు. పలుకుబడి కలిగిన ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో ఆగుతూ వచ్చిన పని ముందుకు సాగుతుంది మరిన్ని మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయ స్వామి ఆరాధన దేవాలయ సందర్శన మంచిది
ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
వారం ప్రారంభంలో అష్టమాధిపతి చంద్రుడు తృతీయరాహువుతో, రాజ్య స్థానంలో రవి, లాభ స్థానంలో కుజ,బుధ యుతి, వారాంతంలో శుక్రుడు కన్యారాశి ప్రవేశం ఫలితాంశములు గమనించగా, ధైర్య సాహసాలు పెరుగుతాయి, సోదర వర్గము తో విభేదాలకు దూరంగా ఉండాలి. సహకారాన్ని అందించే వ్యక్తులతో ఆకస్మిక కలహాలకు అవకాశం. ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ఆకస్మికమైన ఖర్చులు. కమ్యూనికేషన్లో అపార్ధాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో గృహ వాహన విషయాలలో అనుకోని పెట్టుబడులు ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, మీరున్న వృత్తి పరంగా ఉన్నత స్థాయి అధికారులతో సంప్రదింపులు, సహకారాన్ని కోరుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలు ఇబ్బందిని కలిగిస్తాయి. సంతాన వర్గం అభివృద్ధి కరంగా ముందుకు వెళుతుంది, వారి ఆరోగ్యం కొరకు, భూ సంబంధ నూతన పెట్టుబడుల కొరకు జీవిత భాగస్వామితో సంప్రదిస్తారు. వారం చివరిలో రుణముల కొరకు, ఆరోగ్య సంబంధ విషయాలు, న్యాయపరమైన అంశాలు ఆలోచిస్తారు. విద్యార్థులు అధిక శ్రమతో ముందుకు పెడతారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు శ్రీకృష్ణ మందిరాలు దర్శించడం మేలు
మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)
వారం ప్రారంభంలో సప్తమాధిపతి చంద్రుడు ద్వితీయంలో రాహుతోను, అష్టమాధిపతి నవమ స్థానంలోనూ, దశమ స్థానంలో కుజ బుధ యుతి, దాదాపు వారాంతంలో శుక్రుడు నవమ స్థానంలో ప్రవేశం మొదలైన విషయాలు గమనించగా భాగస్వామ్య వ్యవహారాల్లోనూ జీవిత భాగస్వామితోనూ సంఘంలో మైత్రి బంధాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. మాటల వల్ల అపార్ధాలు ఇబ్బందులకు అవకాశమున్న రీత్యా జాగ్రత్తల అవసరం. మధ్యలో వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది మీ శక్తి సామర్ధ్యాలను ఉపయోగించి పనిని పూర్తి చేయడానికి ఎక్కువ కృషీ ముందుకు వెళతారు. మీ పరిచయస్తులైన ఉన్నత అధికారులతోనూ ప్రభుత్వ ఉద్యోగులతోనూ వృత్తి ఆర్థిక అంశాల విషయాలు సంప్రదించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సందర్భంగా ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త వహించాలి. వాహనం గృహానికి సంబంధించిన విషయాలలో చిన్నపాటి రిపేర్లు చికాకులను కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు, ఆత్మీయ వర్గంతో చర్చలు. దూర ప్రదేశంలో ఉండే సంతానం, అభివృద్ధి కొరకు కొంత అనవసర ఆందోళన. ఘర్షణతో కూడిన మీ నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. మరిన్ని మంచి ఫలితాల కొరకు సూర్య అష్టకం వినడం మంచిది
కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
వారం ప్రారంభంలో షష్ఠాధిపతి చంద్రుడు జన్మరాశిలో రాహువుతోను, అష్టమ స్థానంలో రవి, నవమ స్థానంలో బుధ కుజ యుతి, దాదాపు వారాంతంలో అష్టమ స్థానంలో శుక్ర గృహప్రవేశం, ఫలితాంశములు గమనించగా ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా విశ్రాంతి నిద్ర ఆహార స్వీకరణ మొదలైన విషయాలలో కృషి చేయాలి. వారం మధ్యలో వాగ్దానాలు నిలుపుకునే విధంగా ప్రయత్నం చేయాలి, మాటల వల్ల కుటుంబంలోనూ, వృత్తిపరమైన ప్రదేశాల్లోనూ అపార్థాలకు దూరంగా ఉండాలి. గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి అనే విధంగా కృషి చేయాలి. ఆర్థిక విషయాలలో, అనవసర రుణాలు తీసుకునే అంశంలో గౌరవాన్ని తగ్గించుకునే అవకాశాలున్న రీత్యా ఆచితూచి వ్యవహరించాలి. వారం చివర్లో వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు. పని చేసే ప్రదేశాల్లో, మీ పై అధికారులతో, మీ కొలీగ్స్ తో మంచి సంబంధం పెంపొందించుకునే విధంగా కృషి చేస్తారు. విద్యార్థులు నూతన విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. స్వగ్రామ సందర్శన మీద ఉత్సాహాన్ని చూపిస్తారు. మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని వినడం మేలు
మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
వారం ప్రారంభంలో పంచమాధిపతి చంద్రుడు వ్యయంలో రాహువుతో,ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు అష్టమంలో బుధుడితో యుతి, సప్తమ స్థానం రవి, దాదాపు వారాంతంలో శుక్రుడు కన్యారాశి ప్రవేశం ఫలితాంశములను గమనించగా అనవసరమైన వ్యయములు అధికంగా ఉంటాయి. సంతానం యొక్క ఆరోగ్యము దూర ప్రదేశాల్లో వారి యొక్క అభివృద్ధి కొరకు అధికంగా ఆలోచనలు చేస్తారు. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు తగిన విధంగా జాగ్రత్తలు అవసరం. వారం మధ్యలో ముఖ్యమైన పనులు, ఆలోచనలు తాత్కాలికంగా ఆటంకాలు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సంఘంలో మీకు సహకరించే ఉన్నతస్థాయి వ్యక్తులతో అభిప్రాయ బేధాలు ఏర్పడే అవకాశం ఉన్నరీత్యా ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళడం మేలు. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆత్మీయ వ్యక్తులతో వాగ్దానాలు నిలుపుకోవడంలో వారికి సహకరిస్తానన్న అంశంలో ఆలస్యాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. విద్యా సంబంధమైన విషయాలలో, నూతన అంశాల సేకరణలో అధిక దృష్టి సారించాలి. గృహ వాతావరణం కొంత సౌకర్యంగా ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో చక్కబెట్టుకోగలుగుతారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాన్ని వినడం మేలు
(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com
www.padmamukhi.com
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa