ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలాన్ని ఒక ప్రధాన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, అవసరమైన సౌకర్యాల కల్పన కోసం 2,000 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. ఈ నెల 16న శ్రీశైలం పర్యటనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ అంశంపై చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దేవాదాయ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అటవీ, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. శ్రీశైలానికి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "తిరుమల తర్వాత శ్రీశైలం రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతమైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో సరైన పార్కింగ్ వసతి కూడా లేదు. భూమి అందుబాటులో లేకపోతే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం అసాధ్యం" అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2,000 హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖకు బదలాయించాలని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖను కోరాలని నిర్ణయించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని కూడా సూచించారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్నందున ఆలయ సమగ్రాభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న శబరిమల వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధ్యయనం చేసి, శ్రీశైలంలో ఆ తరహా ఏర్పాట్లు చేయాలని ఆయన ప్రతిపాదించారు.అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శ్రీశైలానికి జాతీయ రహదారులతో అనుసంధానం కల్పించాలని సీఎం సూచించారు. దోర్నాల, సుండిపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాల మీదుగా జాతీయ రహదారులను ఆలయానికి అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. అయితే, అభివృద్ధి పనులతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నొక్కిచెప్పారు. ఆలయాల చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలను కాపాడతామని, పచ్చదనాన్ని పెంచేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్యను పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa