నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన డివిజన్ కమిటీ కార్యదర్శి, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యుడు, అలాగే దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ కీలక నేత అయిన మంద రూబెన్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎదుట లొంగిపోయిన ఘటన సంచలనంగా మారింది.పోలీసు కమిషనర్ ప్రకారం, రూబెన్ హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందినవారు. 1979లో కాజీపేట R.E.C.లో హాస్టల్ మెస్ విభాగంలో పనిచేస్తూ రాడికల్ యూనియన్ల ద్వారా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగిన ఆయన, అప్పటి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ప్రభావంతో ఉద్యమంలో చేరారు.1981 నుంచి 1986 వరకు రూబెన్, నేషనల్ పార్క్ దళ కమాండర్ లంక పాపిరెడ్డి నేతృత్వంలో కుంట, బస్తర్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. 1987లో పార్టీ ఆయనను ఏరియా కమిటీ సభ్యుడిగా నియమించగా, 1991లో అనారోగ్యం కారణంగా చికిత్స కోసం కొత్తగూడెం వెళ్తుండగా చత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేసి జగదల్పూర్ జైలుకు తరలించారు. ఏడాదికే జైలులో మరో ముగ్గురు మావోయిస్టులతో కలిసి పరారయ్యారు.తరువాత 1992లో తిరిగి మావోయిస్టు పార్టీలో చేరిన రూబెన్, కుంట మరియు అబుజ్ మడ్ ప్రాంతాల్లో 1999 వరకు ఏరియా కమిటీ సభ్యుడిగా కొనసాగారు. అదే ఏడాది, సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న గోపన్న నేతృత్వంలో బీజాపూర్ జిల్లా గుండ్రాయి గ్రామానికి చెందిన పొడియం భీమను వివాహమాడారు.2005లో డివిజన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ, అనారోగ్యం కారణంగా తన భార్య, పిల్లలతో గుండ్రాయి గ్రామంలోనే నివసిస్తూ గ్రామ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించారు.వయస్సు పెరగడం, ఆరోగ్య సమస్యలు, శరీర సామర్థ్యం తగ్గిపోవడం, ప్రజల్లో మావోయిస్టులపై వ్యతిరేకత పెరగడం, అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస, మళ్ళీ జీవన అవకాశాల పథకాలు రూబెన్ నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు సీపీ వెల్లడించారు.రూబెన్ గతంలో అనేక ఘోర నేరాలలో పాల్గొన్నాడు. కుంట దళ సభ్యుడిగా ఉన్న సమయంలో పెద్ద కేవ్ వాల్, పండోడు, పిడిమాల్, బండారిపాడు గ్రామాల్లోని పలువురు గ్రామస్తులను హత్య చేసిన ఘటనల్లో పాల్గొన్నాడు. 1988లో గొల్లపల్లి–మారాయి గూడ మార్గంలో CRPF కాన్వాయ్‌పై దాడి చేసి, 20 మంది జవాన్లను హత్య చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. 1990లో తుర్లపాడు పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడిలో సెంట్రల్ కమిటీ నేత గోపన్నతో కలిసి పాలుపంచుకున్నాడు.రూబెన్‌పై అప్పటిదాకా రూ. 8 లక్షల రివార్డ్ ఉంది. అతని లొంగుబాటు మావోయిస్టు ఉద్యమం ఉనికిపై మరోసారి చర్చను ప్రారంభించింది. గతంలో చేసిన క్రూరచర్యలు, ప్రస్తుతం తీసుకున్న శాంతియుత నిర్ణయం—ఇవి రెండూ ఈ సంఘటనను దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa