ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్లకీలో కూర్చోబెట్టి మరీ తీసుకెళ్తూ..కలెక్టరమ్మకు ఎమోషనల్ ఫేర్‌వెల్

national |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 08:46 PM

భారత పరిపాలనా సేవలో అధికారుల బదిలీలు సర్వసాధారణం. కానీ కొన్ని వీడ్కోలు సభలు మాత్రం ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంటాయి. తమకు నచ్చిన, విశేష సేవలు అందించిన అధికారులు తమను వదిలి వెళ్లిపోతుంటే తట్టుకోలేకపోతుంటారు. అలాంటి వారికి అరుదైన బహుమతులు ఇస్తూ.. జీవితంలో తమను మర్చిపోకుండా చేసుకోవాలని కోరుకుంటారు. అచ్చంగా అలాగే కోరుకున్నారు మధ్య ప్రదేశ్‌లోని సియోనీ ప్రజలు. తమ జిల్లాకు వచ్చి అద్భుతమైన సేవలు అందించిన కలెక్టరమ్మ.. వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో ఆమెకు ఎవరూ ఊహించని వీడ్కోలు ఇచ్చారు. ముఖ్యంగా ఆమెను ఓ పల్లకీలో కూర్చోబెట్టి.. స్వయంగా తమ భుజాలపై పెట్టుకుని మోసుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అయిన సంస్కృతి జైన్.. సుమారు ఏడాది పాటు సీయోనీ కలెక్టర్‌గా సేవలు అందించారు. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పరిపాలనా మార్పుల్లో భాగంగా.. 12 జిల్లాల కలెక్టర్లతో పాటు ఆమె కూడా బదిలీ అయ్యారు. ఆమెను ఇప్పుడు భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించడంతో పాటు మధ్య ప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను కూడా అప్పగించారు.


 అయితే సీయోనీలో ఆమె పని చేసిన కేవలం ఏడాదే అయినా.. ఎప్పుడూ ఆమె ప్రజలకు అందుబాటులో ఉండడం, సమస్యలతో వచ్చిన వారికి కచ్చితంగా పరిష్కార చూపించడంతో.. అందరికీ అభిమాన అధికారిణిగా మారిపోయారు. ముఖ్యంగా ఆమె ప్రజా సంక్షేమంపై చూపిన శ్రద్ధ వల్ల విపరీతమైన గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా ఆమె కమ్యూనిటీతో పెంచుకున్న ఆత్మీయ బంధానికి చిహ్నంగా.. స్థానికులు, ఉద్యోగులు ఆమెకు ఒక అసాధారణమైన వీడ్కోలు ఇచ్చారు.


వీడ్కోలు వేడుక ముగిసిన తర్వాత.. సంస్కృతి జైన్‌ను ఆమె సహచరులు, సిబ్బంది అందంగా అలంకరించిన పల్లకీలో కూర్చోబెట్టి మోసుకెళ్లారు. ఈ సమయంలో ఆమెతో పాటు ఆమె ఇద్దరు చిన్న కూతుళ్లు కూడా పల్లకీలో ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఒక కలక్టరమ్మకు ఇలాంటి వీడ్కోలు ఇవ్వడం చాలా ముచ్చటగా అనిపిస్తోందని.. ఆమె ఎంత సేవ చేసుంటే ఇలాంటి అదృష్టం వచ్చిందో అర్థం అవుతుందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.


సంస్కృతి జైన్ నేపథ్యం..


ఐఏఎస్ అధికారిణి సంస్కృతి జైన్ 1989 ఫిబ్రవరి 14న శ్రీనగర్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ భారత వైమానిక దళంలో పని చేయడం వల్ల ఆమె బాల్యం భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో గడిచింది. ఆమె తండ్రి ఫైటర్ పైలట్‌గా, తల్లి వైద్య విభాగంలో సేవలందించారు. గోవాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సంస్కృతి జైన్.. ప్రతిష్టాత్మకమైన LAMP ఫెలోషిప్‌ను అభ్యసించారు. ఆ తర్వాత పీహెచ్‌డీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ స్నేహితుల సలహా మేరకు ఆమె సరదాగా యూపీఎస్సీ పరీక్ష రాశారు. ఆశ్చర్యకరంగా మొదటి ప్రయత్నంలోనే ఆమె పరీక్షలో విజయం సాధించారు. రెండో ప్రయత్నంలోనే ఆమె ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)లో స్థానం పొందారు. ఇక మూడో సారి కూడా ప్రయత్నించగా.. అఖిల భారత స్థాయిలో 11వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారిణిగా ఎంపిక అయ్యారు. 2015 బ్యాచ్ ఆఫీసర్‌గా.. ఆమెను మధ్యప్రదేశ్ కేడర్‌కు కేటాయించారు. గత కొన్నేళ్లుగా సంస్కృతి జైన్ రేవా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, సత్నా అదనపు కలెక్టర్‌గా, మౌగంజ్ ఎస్‌డీఎంగా, అలీరాజ్‌పూర్, నర్మదాపురం జిల్లా పంచాయతీల సీఈఓగా వంటి అనేక ముఖ్యమైన పరిపాలనా పాత్రలను విజయవంతంగా నిర్వహించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa