ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్థాన్ సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. 19 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అఫ్గనిస్తాన్ సరిహద్దు ప్రావిన్సుల్లోని ఒరక్జాయ్ జిల్లాలో తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (పాక్ తాలిబన్లు) సంస్థకు చెందిన ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగింది. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో మంగళవారం రాత్రి భారీ ఆపరేషన్ ప్రారంభించినట్టు పాక్ ఆర్మీ ప్రకటించింది. తాము చేపట్టిన ఈ ఆపరేషన్ ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలిస్తుందని ఆర్మీ తెలిపింది.
గత నెలలో ఇదే ప్రావిన్సుల్లోని కరాక్ జిల్లాలో ఉగ్రవాద స్థావరంపై విరుచుకుపడిన పాక్ సైన్యం 17 మంది టీటీపీ ఉగ్రవాదులను హతమార్చింది. అయితే, ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దీనికి ముందు డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో చేపట్టిన ఆపరేషన్‌లో 13 మంది పాకిస్థాన్ తాలిబన్ ఉగ్రవాదులను మృతిచెందారు. ఇటీవల కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంబంధిత హింస పెరుగుతోంది. ఈ ఘటనల్లో ఎక్కువ శాతం వాటికి టీటీపీ బాధ్యత వహించింది. అఫ్గనిస్థాన్‌లో ఆగస్టు 2022లో తాలిబన్లు తిరిగి అధికారం చేపట్టినప్పటి నుంచి టీటీపీ కార్యకలాపాలు తీవ్రతరం చేసింది. ఆ గ్రూప్‌కి చెందిన చాలా మంది నేతలు, ఉగ్రవాదులు అఫ్గన్‌లో తలదాచుకుంటున్నారు.
గత నెలలో పాక్ ప్రభుత్వం తిరా లోయలోని ఉగ్రవాదుల కేంద్రంగా పేర్కొంటూ ఒక గ్రామంపై జరిపిన బాంబు దాడి ఆ ప్రాంతంలో హింస, సైనిక చర్య స్థాయి స్పష్టంగా బయటపెట్టింది. టీటీపీ బాంబుల తయారీ ఫ్యాక్టరీని లక్ష్యంగా చేసుకున్న ఈ ఆపరేషన్‌లో మహిళలు, పిల్లలు సహా ముప్పై మంది పౌరులు మరణించారు. గత మూడు నెలల్లోనే పాకిస్థాన్ వ్యాప్తంగా తీవ్రవాద సంబంధిత హింస 46 శాతం పెరిగినట్టు ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 329 ఉగ్రదాడులు, సైన్యం ఆపరేషన్లలో 901 ప్రాణాలు కోల్పోయారని, రో 599 మంది గాయపడ్డారని తెలిపింది. ఖైబర్‌ఫఖ్తూంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులు అఫ్గన్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. పాక్‌లోని మొత్తం ఉగ్రవాద సంబంధిత హింసలో 96 శాతం ఈ రెండు ప్రావిన్సుల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్స్ అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. పాక్ మొత్తం హింసాత్మక ఘటనల్లో సుమారు 71 శాతం మరణాలు, 67 శాతం ఘటనలు ఈ ప్రాంతంలోనే చోటుచేసుకున్నాయి. అటు, బలూచిస్థాన్‌లోని వేర్పాటువాద ఉద్యమం పాకిస్థాన్‌కు కంటిలో నలుసుగా తయారయ్యింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ మెరుపు దాడులతో పాక్ సైన్యాలు హడలిపోతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa