ప్రేమ.. పలకడానికి రెండు అక్షరాల పదమైన.. మాటల్లో వర్ణించడానికి భాషలోని లిపి మొత్తం సరిపోదు. సముద్రానికంటే లోతైనదీ.. ఎవరెస్ట్ కంటే ఎత్తైనదీ.. బంగారం కంటే విలువైనదీ.. వజ్రం కంటే గట్టిది ప్రేమ.. అలాగే విషం కంటే ప్రమాదకరమైనది.. కత్తి కంటే పదునైనది కూడా ప్రేమే. గుంటూరు జిల్లా దాసరిపాలెంలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. ఓ యువకుడు.. మరో యువతిని గాఢంగా ప్రేమించాడు. తనే సర్వస్వం అనుకున్నాడు.. తన తోడిదే లోకమనుకున్నాడు.. తనతో ఏడు అడుగులు కలిసి నడవాలనుకున్నాడు.. అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది.. ఈ ప్రేమ కథలోనూ అంతే.. మనోడు ధైర్యం చేసి తన ప్రేమ సంగతి ఇంట్లో చెప్పలేకపోయాడు. దీంతో ఈ ప్రేమకథ కూడా సుఖాంతం కాలేదు. అదేంటో సినిమాల్లో ఎలాగైనా గెలిచే ప్రేమ.. నిజ జీవితంలో నిలవలేదేందుకో.. నిలిచి, గెలవలేదు ఎందుకో.. మనోడి ప్రేమ కూడా అలాగే..
పెళ్లైన వారానికే అలా..
అతని పేరు చంటి, ఊరు దాసరిపాలెం.. ఈ మధ్యనే ఇంట్లో వాళ్లు ఓ పిల్లను చూసి పెళ్లి చేశారు. మనోడి ప్రేమ సంగతి తెలియని ఆ అమ్మాయి కోటి ఆశలతో కొత్త జీవితంలోకి, అత్తారింటిలోకి అడుగుపెట్టింది. ఆగస్ట్ నెలలో కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లైంది. అయితే మనోడి ప్రేమ వ్యవహారం ఆ అమ్మాయికి తెలియడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. పెళ్లైన వారానికే ఆత్మహత్యాయత్నం.. ఎలుకల మందు తాగి. బ్లేడుతో చేయి కోసుకున్నాడు చంటి. కుటుంబసభ్యులు గమనించి సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పెళ్లైన వారానికే ఇలా ఎందుకు చేశావని గట్టిగా నిలదీయటంతో అదిగో.. అప్పుడు చెప్పాడు తన ప్రేమ సంగతి. ఇదేదో పెళ్లికి ముందు తెలిసి ఉన్నా వారిద్దరి పెళ్లి చేసేవారేమో కానీ.. పెళ్లైపోవటంతో నమ్మి వచ్చిన ఆ అమాయకురాలి గొంతు కోయలేక, పెద్దలు ఆ యువకునికి నచ్చజెప్పారు. సర్దుకుపోవాలన్నారు.
పెద్దల మాట విన్న ఆ యువకుడు కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ ఈలోపు మళ్లీ ఏమైందో తెలియదు . బుధవారం రోజు చంటి ముభావంగా ఉండటం గమనించిన అతని భార్య.. ఏమైందని అడిగింది. దీంతో తాను ప్రేమించిన అమ్మాయి గుర్తుకొస్తుందని చెప్పాడు చంటి. జ్వరంగా ఉందనటంతో కుటుంబసభ్యులు మాత్రలు తెచ్చి ఇచ్చారు. గురువారం ఉదయం భార్య టిఫిన్ చేస్తున్న సమయంలో.. రేకుల షెడ్డులోకి వెళ్లిన చంటి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చంటి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కన్నోళ్లను, కట్టుకున్న దాన్ని ఒంటరిని చేసిన చంటి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
నమ్మి వస్తే.. నెలకే ఇలా..
అయితే కొత్త జీవితంపై కోటి ఆశలతో, భర్తతో ఎన్నెన్నో ఊహించుకుని వచ్చిన ఆ యువతి.. రెండు నెలలు కూడా తిరగకుండానే వైధవ్యం పొందాల్సి వస్తోంది. ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించిన ఆ యువకుడు, ఆమెను మనసు, తనువు నిండా నింపుకున్న ఆ యువకుడు.. తనను నమ్మి, తనతో ముప్పావు జీవితం గడపాల్సిన వ్యక్తి గురించి మాత్రం ఆలోచించలేకపోయాడని స్థానికులు, కుటుంబసభ్యులు వాపోతున్నారు. దాసరిపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అలాగే అటు యువకుడి కుటుంబంలోనూ, ఇటు యువతి కుటుంబంలోనూ తీరని వేదనను మిగిల్చింది. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa