ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టింది. రేషన్ బియ్యం పక్కదారి పట్టకూడదని, పేదలకు రేషన్ సరఫరాలో పారదర్శకత కోసం పాత బియ్యం కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకువచ్చింది. క్యూఆర్ కోడ్‌తో, ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు పంపిణీ చేసింది. పాత లబ్ధిదారులతో పాటుగా కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పంపిణీ చేసింది. ఆగస్ట్ 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకూ మొత్తం నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సాయంతో వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దనే స్మార్ట్ కార్డులు అందించింది. జిల్లాల వారీగా అధికారులు వీటిని పంపిణీ చేశారు.
స్మార్ట్ రేషన్ కార్డుల సాయంతో రేషన్ సరుకులు కూడా పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటంతో ద్వారా రేషన్ సరుకుల పంపిణీ స్థితి వంటి వివరాలను తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసినప్పటికీ చాలా మంది వాటిని తీసుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. రూపాయి కూడా కట్టాల్సిన పనిలేకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా వీటిని అందిస్తున్నారు.
అయితే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సమయంలో అథెంటిఫికేషన్ తప్పనిసరి. ఓటీపీ, ఫేస్ రికగ్నిషన్, థంబ్ వంటి వాటిలో ఏదో ఒకదాని సాయంతో అథెంటిఫికేషన్ తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నారు. రేషన్ షాపు వద్దకు నేరుగా వచ్చినవారికి రేషన్ డీలర్లు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు స్మార్ట్ రేషన్ కార్డులను ఫేసియల్ రికగ్నిషన్, థంబ్ వంటి సాయంతో అథెంటిఫికేషన్ పూర్తి చేసి అందిస్తున్నారు. అలా రాలేని వారికి ఓటీపీ ద్వారా కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నారు.
అయితే బాపట్ల జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల జారీ ప్రారంభమై ఇప్పటికి మూడు వారాలు దాటినప్పటికీ ఇంకా 59 వేల కుటుంబాలు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం వాటిని ఉచితంగా అందిస్తున్నప్పటికీ తీసుకోవడానికి ముందుకు రాకపోవటంతో.. వీటిలో ఏవైనా బోగస్ కార్డులు ఉన్నాయా అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు రేషన్ దుకాణాల్లో రాయితీ మీద సరుకులు అందుకోవటంతో పాటుగా ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు అర్హులు అవుతారని అధికారులు చెప్తున్నారు. అర్హులై ఉండి , స్మార్ట్ కార్డులు పొందినవారు తప్పకుండా వాటిని తీసుకోవాలని.. వాటి ప్రయోజనాలను పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa