పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు రావల్పిండిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలోనే పాకిస్థాన్ అధికారులు కీలకమైన భద్రతా చర్యలను అమలు చేశారు. ముఖ్యంగా తహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ అనే కరుడుగట్టిన ఇస్లామిస్ట్ పార్టీ శుక్రవారం తలపెట్టిన 'లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్' నేపథ్యంలో అధికారులు రాజధాని ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించే, నిష్క్రమించే మార్గాలను మూసివేశారు. అలాగే రెండు ప్రధాన నగరాల్లో మొబైల్ సేవలను బంద్ చేశారు.
పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి ఇస్లామాబాద్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాలనే టీఎల్‌పీ పిలుపు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. మొబైల్, ఇంటర్నెట్ సేవలను శుక్రవారం అర్ధరాత్రి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేస్తారు. భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా ఈ సస్పెన్షన్‌ను తక్షణమే అమలు చేయాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (PTA)కి ఆదేశాలు జారీ చేశారు. అంతర్గత మంత్రిత్వ శాఖ మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ నిరవధిక సస్పెన్షన్‌కు ఆమోదం తెలిపారు.
టీఎల్‌పీ నిరసన ప్రణాళికపై పంజాబ్ ప్రావిన్స్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. గురువారం రోజు లాహోర్‌లో టీఎల్‌పీ సభ్యులకు, పోలీసులకు మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో డజన్ల కొద్దీ వ్యక్తులు గాయపడ్డారు. ఇస్లామాబాద్‌లో భారీ ప్రదర్శనకు టీఎల్‌పీ పిలుపునిచ్చిన వెంటనే.. పంజాబ్ పోలీసులు ఆ పార్టీ అధినేత సాద్ హుస్సేన్ రిజ్వీని అరెస్టు చేయడానికి టీఎల్‌పీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు.
నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తూ.. పంజాబ్ ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్ 144ను అమలు చేసింది. తదుపరి 10 రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని చెప్పింది. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు బహిరంగ ప్రదేశాలలో గుమిగూడటం లేదా సభలు నిర్వహించడంపై నిషేధం విధించినట్లు వివరించింది. అయితే, ప్రార్థనలు, వివాహాలు, అంత్యక్రియలు, కార్యాలయాలు లేదా కోర్టుల ఆవరణలకు ఈ ఆంక్షలు వర్తించవు. అంతేకాకుండా పంజాబ్ అంతటా ఆయుధాల ప్రదర్శన, లౌడ్‌స్పీకర్ల వాడకంపై పూర్తి నిషేధం విధించింది.
మరోవైపు రావల్పిండిలో సెక్షన్ 144 ఇప్పటికే అక్టోబర్ 11 వరకు అమలులో ఉంది. ఇస్లామాబాద్‌లో అధికారులు అన్ని ప్రధాన ప్రవేశ మార్గాలను బారికేడ్లు వేసి మూసివేశారు. అత్యంత సున్నితమైన ప్రాంతమైన రెడ్ జోన్‌ను పూర్తిగా సీల్ చేశారు. రెడ్ జోన్‌లోకి అధికారికంగా అనుమతి పొందిన సిబ్బందికి మాత్రమే మార్గల్లా రోడ్డు మీదుగా ప్రవేశం కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa