ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ మద్యం తయారీ కేసులో కీలక విషయాలు తెలిపిన జనార్దన్‌రావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 04:51 PM

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి జనార్దన్‌రావుకు విజయవాడ న్యాయస్థానం ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ విధించింది. శనివారం ఉదయం ఎక్సైజ్ శాఖ అధికారులు అతడిని ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించి, కీలక వివరాలు రాబట్టారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జనార్దన్‌రావు నేర సామ్రాజ్యానికి సంబంధించిన విస్తుపోయే నిజాలు, అతని కార్యకలాపాల వెనుక ఉన్న పక్కా ప్రణాళికలు వెలుగులోకి వచ్చాయి.రిమాండ్ రిపోర్టు ప్రకారం, జనార్దన్‌రావు 2012 నుంచి మద్యం వ్యాపారంలో ఉన్నాడు. ఇబ్రహీంపట్నంలో 'ఏఎన్‌ఆర్' పేరుతో బార్ నడుపుతూ మంచి లాభాలు ఆర్జించాడు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారి పక్కనే ఉన్న బార్‌ను వేరే ప్రాంతానికి మార్చడంతో వ్యాపారం దెబ్బతింది. దీనికి తోడు కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో 2021 నాటికి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాడు. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. నకిలీ మద్యం తయారీతో సులువుగా డబ్బు సంపాదించవచ్చని భావించి, ఆ దిశగా ప్రణాళికలు రచించాడు.మొదట హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఒక గదిని అద్దెకు తీసుకుని తన కార్యకలాపాలు ప్రారంభించాడు. అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఓ సరికొత్త ఎత్తుగడ వేశాడు. 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాల్లో మద్యాన్ని నింపి, వాటిపై 'ఫినాయిల్' అని స్టిక్కర్లు అంటించి నకిలీ ఇన్‌వాయిస్‌లతో ఇబ్రహీంపట్నంకు తరలించేవాడు. అక్కడ ఈ కేసులో ఐదో నిందితుడైన హాజీ వాటిని అందుకుని, లీటర్ బాటిళ్లలో నింపి విక్రయించేవాడు. ఇలా కొన్నాళ్లపాటు తన అక్రమ వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నడిపించాడు.2023లో గోవాకు వెళ్లిన జనార్దన్‌రావుకు, అక్కడే స్థిరపడిన తెలుగు వ్యక్తి, ఈ కేసులో మూడో నిందితుడైన బాలాజీతో పరిచయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు అధికంగా ఉన్నాయని, గోవా నుంచి ఖరీదైన బ్రాండ్లను తక్కువ ధరకు తెచ్చి అమ్మితే భారీ లాభాలు వస్తాయని బాలాజీ ఆశ చూపాడు. దీంతో వీరిద్దరూ కలిసి నకిలీ మద్యం తయారీని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నారు. డిస్టిలరీలతో పరిచయాలున్న బాలాజీ ముడిసరుకు (స్పిరిట్) సరఫరా చేసేవాడు. హైదరాబాద్‌కు చెందిన మరో నిందితుడు రవి (ఏ4) నకిలీ లేబుల్స్, ప్రసాద్ అనే వ్యక్తి బాటిల్ మూతలను సమకూర్చేవారు. ముడిసరుకును బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి నగరాల నుంచి ఐషర్ వ్యాన్‌లలో తరలించేవారని రిపోర్టులో పేర్కొన్నారు.2023 నుంచి ఇబ్రహీంపట్నంలోని తన ఏఎన్‌ఆర్ బార్‌లోనే కల్తీ మద్యం తయారీని ప్రారంభించాడు. మంజీరా విస్కీ, కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ వంటి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ మద్యాన్ని సృష్టించి, మొదట తమ బార్‌లోనే అమ్మేవారు. ఈ దందాలో ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ.35 నుంచి రూ.40 వరకు లాభం పొందినట్లు తేలింది. 2024 ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే సమయంలో తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డితో జనార్దన్‌రావుకు స్నేహం ఉందని, ఆయన అనుచరులైన సురేంద్ర నాయుడు, పీఏ రాజేష్‌లు వైన్ షాపులు దక్కించుకున్నారని కూడా రిపోర్టులో ప్రస్తావించారు. అయితే మద్యం వ్యాపారంలో అనుభవం లేకపోవడంతో వీళ్లిద్దరూ నష్టపోయారు. 2025 మే నెల నుంచి ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో ఏకకాలంలో మళ్లీ తయారీని మొదలుపెట్టాడు. అయితే, గత నెల 25న జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నాడని తెలిసి జనార్దన్‌రావు కూడా అక్కడికి వెళ్లాడు. రువాండాలో ఉన్న సమయంలోనే ములకలచెరువు అడ్డాపై ఎక్సైజ్ అధికారులు దాడి చేసి గుట్టురట్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేసినట్లు, జనార్దన్‌రావు విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa