ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కర్ణాటకలో ఆరెస్సెస్ వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మరో రాజకీయ మాటల యుద్ధానికి కారణం అయింది. ఆరెస్సెస్ చేస్తున్న కార్యకలాపాలపై నిషేధం వేయాలంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక సీనియర్ మంత్రి ప్రియాంక్ ఖర్గే.. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు లేఖ రాయడం తీవ్ర చర్చకు దారి తీసింది. అదే సమయంలో మరికొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే రకమైన వినతులను కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్‌కు అందించారు. అితే వీటిని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. ఇక అధికార పార్టీ తీరుపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
కర్ణాటకలోని ప్రభుత్వ స్థలాలు, స్కూల్ గ్రౌండ్లు, దేవాలయాల ప్రాంగణాల్లో ఆరెస్సెస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈనెల 4వ తేదీన లేఖ రాయడం కన్నడ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఈ లేఖను పరిశీలించాలని అధికారులను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కర్ణాటక సీఎస్‍కు లేఖలా రాసినట్లు తెలుస్తోంది.
ఎలాంటి పోలీస్ అనుమతులు లేకుండా ఆరెస్సెస్ కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. స్కూల్ గ్రౌండ్లు, దేవాలయాల ప్రాంగణాలు వంటి ప్రభుత్వ ఆస్తులను ఆర్ఎస్‌ఎస్ తన షాఖాల కోసం వాడుకుంటోందని పేర్కొన్నారు. భారత సమైక్యతకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ షాఖాల్లో నినాదాలు చేస్తున్నారని.. పిల్లలు, యువత మనస్సుల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా భావాలను నింపుతున్నారని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ఆర్ఎస్‌ఎస్ ఇచ్చే లాఠీ శిక్షణ.. పిల్లలు, యువకులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రియాంక్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.
ప్రియాంక్ ఖర్గే డిమాండ్‌పై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు
ఆరెస్సెస్‌పై ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. సొంత పార్టీలోనే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు నేతలు ప్రియాంక్ ఖర్గేకు మద్దతు పలుకుతూ.. ఆరెస్సెస్‌పై చర్యల తీసుకోవాలని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ వంటి సీనియర్ నేతలు ప్రియాంక్ ఖర్గే చేసిన డిమాండ్‌ను సమర్థిస్తున్నారు. ఆరెస్సెస్ రిజిస్టర్ అయిన సంస్థ అయితే దానికి సంబంధించిన పత్రాలు చూపించాలని డిమాండ్ చేశారు.
ఇక మరికొందరు మాత్రం ఆరెస్సెస్‌కు మద్దతు పలుకుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరోసారి ఇరకాటంలో పడేశాయి. ఆరెస్సెస్ తనదైన శైలిలో సేవలను అందించే చరిత్ర కలిగిన సంస్థ అని.. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా సేవలు చేస్తోందని ప్రశంసలు గుప్పించడం గమనార్హం. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్ట్ నెలలో కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలోనే డీకే శివకుమార్ ఆరెస్సెస్ గీతాన్ని ఆలపించడం అప్పట్లో పెను దుమారం రేపింది.
బీజేపీ తీవ్ర విమర్శలు
ఆరెస్సెస్‌పై ప్రియాంక్ ఖర్గే సీఎంకు లేఖ రాయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర అభివర్ణించారు. ఇలాంటి జిమ్మిక్కులతో ముఖ్యమంత్రి పదవికి దగ్గర కావచ్చని ప్రియాంక్ ఖర్గే భ్రమ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో మూడు సార్లు ఆరెస్సెస్‌ను నిషేధించడానికి ప్రయత్నించిందని.. కానీ చివరికి నిషేధాన్ని ఎత్తివేసి.. 1971 యుద్ధంలో ఆరెస్సెస్ సేవలను గుర్తించి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఆహ్వానించిందనే విషయాన్ని ఈ సందర్భంగా బీవై విజయేంద్ర గుర్తు చేశారు. ఖర్గే చేస్తున్న డిమాండ్ కాంగ్రెస్ అనుసరిస్తున్న మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు కొనసాగింపు అని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa